సాక్షి మాక్ ఎంసెట్‌కు విశేష స్పందన
– ఉత్సాహంగా తరలివచ్చిన విద్యార్థులు
రాప్తాడు / హిందూపురం అర్బన్ : సాక్షి మీడియా గ్రూప్‌తో పాటు శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్‌వీఐటీ), బిట్ ఇంజినీరింగ్ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదివారం నిర్వహించిన మాక్ ఎంసెట్‌కు విశేష స్పందన లభించింది. హంపాపురం వద్ద ఉన్న ఎస్‌వీఐటీ, హిందూపురంలోని బిట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్షను నిర్వహించారు. అనంతపురం నుండే కాక జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. మూడు గంటల పాటు కళాశాలలో నిర్వహించిన ఈ పరీక్షలను ఎస్‌వీఐటీలో సాక్షి దినపత్రిక బ్రాంచ్ మేనేజర్ కేదార్‌నాథ్‌రెడ్డి, కళాశాల వైస్ చైర్మన్ సి.చక్రధర్‌రెడ్డి, పర్యవేక్షించారు. హిందూపురంలో పరీక్ష పత్రాలను బిట్ కళాశాల చైర్మన్ పి.చంద్రమోహన్, కళాశాల ప్రిన్సిపల్ రమేష్ విడుదల చేశారు.
సమయపాలన తెలిసింది
- నవ్యశ్రీ, బాలాయేసు కళాశాల, హిందూపురం
సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ ఎంసెట్ చాలా మాకు ఎంతగానో దోహదపడింది. ముఖ్యంగా ఈ పరీక్ష వల్ల సమయ పాలన బాగా తెలిసొచ్చింది. ఓ రకంగా చెప్పాలంటే ప్రధాన పరీక్షపై పడుతున్న టెన్షన్ బాగా తగ్గిపోయినట్లే. థ్యాంక్స్ టు సాక్షి.
మంచి ర్యాంకు వస్తుంది
– హరిణిరెడ్డి, అనంతపురం
ఎంసెట్ ఎగ్జామ్ అంటే చాలా భయంగా ఉండేది. పరీక్ష ఎలా రాయాలో కూడా తెలియదు. సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ ఎంసెట్ ద్వారా పరీక్ష ఎలా రాయాలో తెలిసింది. కచ్చితంగా త్వరలో నిర్వహించే ఎంసెట్ మంచి మార్కులు సాధిస్తా. ఇలాంటి పరీక్షలను విద్యార్థులు తప్పకుండా వినియోగించుకోవాలి.