‘సాక్షి’కి సంకెళ్లా?
సర్వత్రా పెల్లుబుకుతున్న జనాగ్రహం
విజయవాడలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ర్యాలీ, నిరసన
బంటుమిల్లిలో అంబే డ్కర్ విగ్రహానికి వినతిపత్రం
తిరువూరు, మైలవరం, జి.కొండూరులో రోడ్డెక్కిన వివిధ పార్టీల నేతలు
నిజాలను నిర్భయంగా ప్రసారం చేస్తున్న ‘సాక్షి’చానల్ ప్రసారాలను నిలిపేయడం హేయమైన చర్య అని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు, నేతలు అభిప్రాయపడ్డారు. మాచవరం ఆంజనేయస్వామి గుడి సమీపంలో సోమవారం జరిగిన ఆందోళన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను ‘పచ్చ’ పాలకులు హరించి వేస్తున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు. వెంటనే సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
విజయవాడ : ప్రజాహిత కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న సాక్షి చానల్ ప్రసారాలను రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరితో ఐదు రోజులుగా నిలిపివేయడంపై జనాగ్రహం వెల్లువెత్తుతోంది. ప్రభుత్వం దిగి రాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తొలుత హెచ్చరించినట్లుగానే అనేక నియోజకవర్గాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని కాపు నేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న నిరాహారదీక్షకు ఒకవైపు కాపు సంఘాల నుంచి మద్దతు పెరుగుతుంటే మరోకవైపు సాక్షి చానల్ ప్రసారాలను పునరుద్ధరించాలనే ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. సాక్షి చానల్ ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు(ఏపీయూడబ్యూజే) ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్‌క్లబ్ నుంచి సబ్‌కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి సబ్‌కలెక్టర్ సృజనకు మెమోరాండం సమర్పించారు. ఐజేఏ సభ్యులు జి.రాజారమేష్, ఏపీయూడబ్యూజే అర్బన్ ఉపాధ్యక్షుడు దాసరి నాగరాజు కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.నాగమల్లేశ్వరరావు, మాజీ సభ్యుడు చావ రవి, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు ఆర్.సూర్యకిరణ్(వసంత్) ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరీ కొండా రాజేశ్వరరావు, కోశాధికారి షపీ ఉల్లా, కార్యవర్గ సభ్యుడు సి.హెచ్.రమణారెడ్డితో పాటు పలువురు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన పాత్రికేయులు పాల్గొన్నారు.
సాక్షి మీడియాపై ప్రభుత్వ ఆంక్షలను నిరసిస్తూ తిరువూరులో సోమవారం జర్నలిస్టులు ప్రదర్శన జరిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి ప్రెస్‌క్లబ్ నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి ధర్నా చేశారు. తహసీల్దారుకు వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ నాయకులు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి.
పత్రికా స్వేచ్ఛను హరించడం దారుణం
ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు
విజయవాడ : భావప్రకటనా స్వేచ్ఛను, పత్రికాస్వేచ్ఛను ప్రభుత్వం హరించాలనుకోవడం దురదృష్టకరమని ఇండియన్ జర్నలిస్టు అసోసియేషన్ (ఐజేఎ) ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు అభిప్రాయపడ్డారు. సాక్షి చానల్స్, నంబర్1 చానల్ ప్రసారాలను ప్రభుత్వం నిలుపుదల చేయించిన నేపథ్యంలో అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ ఆర్టికల్ 19(1)ఎ షెడ్యూల్డ్ ప్రకారం వచ్చిన హక్కని తెలిపారు. గతంలో అనేక రాజకీయ పార్టీలు వచ్చినా పత్రికా స్వేచ్ఛపై దృష్టిపెట్టలేదని, ఈ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించివేస్తోదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాక్షి ప్రసారాలు పునరుద్ధరించాలి: వైఎస్సార్‌సీపీ
సాక్షి చానల్‌ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మాచవరంలో అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ కార్పొరేటర్లు చందన సురేష్, బొప్పన భవకుమార్, దాసరి మల్లేశ్వరీ, వీరమాచినేని లలిత, పైడిమాల సుభాషిణి, కావటి దామోదర్, చొడిశెట్టి సుజాత ఆధ్వర్యంలో పార్టీనేతలు, సాక్షి అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు తుమ్మల ఫ్రాన్సిస్‌రాజు తదితర నేతలు ధర్నాలో పాల్గొన్నారు. పంజా సెంటర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ కార్పొరేటర్లు నోటికి నల్ల రిబ్బన్లు ధరించి మౌన ప్రదర్శన నిర్వహించారు.
చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని...
చంద్రబాబునాయుడుకు మంచి బుద్ధి ప్రసాదించి సాక్షి చానల్ ప్రసారాలను పునరుద్ధరించాలని బంటుమిల్లిలో అఖిలపక్షం నేతల ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి విన్నతిపత్రం ఇచ్చారు. లక్ష్మిపురం సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగిరమేష్, పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉపాలరాంప్రసాద్ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పాలరాము, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల రామాంజేయులు, పీసీసీ కార్యదర్శి పిన్నంటి విశేశ్వరరావు, సీపీఎం మండల కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
మీడియా గొంతునొక్కడం అప్రజాస్వామికం..
ప్రజాస్వామ్యంలో మీడియాకు ప్రముఖస్థానం ఉంది. ప్రభుత్వంచేసే తప్పులను ఎత్తిచూపడం మీడియా బాధ్యత. సాక్షి టెలివిజన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతుందనే అక్కసుతోనే ప్రసారాలను నిలిపివేసేలా సీఎం చంద్రబాబు కుట్ర పన్నారు. ముద్రగడ చేపట్టిన దీక్ష వివరాలను రాష్ట్ర నలుమూలలకు వ్యాపించకుండా అడ్డుకునే యత్నంలో భాగంగానే సాక్షి టీవీ ప్రసారాలను నిలిపి వేశారు. సీఎం చంద్రబాబు మాత్రం నియంతలా వ్యవహారిస్తున్నారు. - వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దుట్టా రామంచంద్రరావు
బాబుది నియంతృత్వ పాలన
ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతుందనే అక్కసుతో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం అప్రజాస్వామికమని వైఎస్సార్‌సీపీ డాక్టర్స్‌సెల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెహబూబ్ షేక్ అన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను హరిస్తూ నియంతలా చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించే వరకూ సాక్షి ప్రసారాలు ఇవ్వబోమని రాష్ట్రహోం మంత్రి చెప్పడం సిగ్గుచేటన్నారు. - వైఎస్సార్‌సీపీ డాక్టర్స్‌సెల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మెహబూబ్ షేక్
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
రాష్ట్రంలో ప్రతిపక్షాలు..ప్రభుత్వ అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చే మీడియా లేకుండా చంద్రబాబు పాలించాలని చూస్తున్నారని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆంధ్రప్రదే శ్ కాంగ్రెస్ కమిటీ డాక్టర్స్ సెల్ కోచైర్మన్ డాక్టర్ అంబటి రాధాకృష్ణ అన్నారు. నిజాయితీ పరుడునని చెప్పుకుంటున్న చంద్రబాబు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నాడని ఆయన పశ్నించారు. తక్షణమే సాక్షిటీవీ ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
- డాక్టర్ అంబటి రాధాకృష్ణ, ఏపీసీసీ డాక్టర్స్‌సెల్ కో చైర్మన్
ప్రజలే బుద్ధిచెబుతారు.
ప్రసారమాధ్యమాలపై కక్షసాధింపు ధోరణి చంద్ర బాబు ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. ప్రభుత్వం చేసే అన్యాయాలను, అక్రమాలను, అవినీతిని అడుగడుగునా ప్రసారం చేస్తున్నందుకు సాక్షి పై కక్షసాధించడం హేయం.
- పుణ్యశీల, వీఎంసీ వైఎస్సార్‌సీపీ పక్షనేత