బాలుడిని ఢీకొన్న ఇసుక లారీ
బాలుడిని ఢీకొన్న ఇసుక లారీ
Published Wed, Mar 1 2017 11:25 PM | Last Updated on Tue, Sep 5 2017 4:56 AM
తీవ్ర గాయాలు
ధర్నాకు దిగిన స్థానికులు
డీఎస్పీ చర్చలతో ఆందోళన విరమణ
సీతానగరం : రఘుదేవపురంలో ఇసుక లారీ బుధవారం ఉదయం ఓ బాలుడిని ఢీకొట్టడంతో అతడి కుడి చెయ్యి విరిగి, ఎముక బయటకు వచ్చేసింది. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన స్థానికులు న్యాయం కోరుతూ రోడ్డుపై బైఠాయించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రఘుదేవపురానికి చెందిన నడుపూడి దుర్గారావు, నాగాలు కూలిపని కోసం వరంగల్ వెళుతూ తన బంధువులు తాడి అప్పలనాయుడు ఇంటి వద్ద పన్నెండేళ్ల కుమారుడు నవీన్‌ను వదిలివెళ్లారు. నవీన్ బుధవారం ఉదయం 8 గంటలకు బంధువుల ఇంట పెళ్లి సందర్భంగా బహుమతి కొని సెంటర్ నుంచి సైకిల్‌పై తిరిగి వెళుతున్నాడు. ఇంతలో వంగలపూడి ర్యాంపు నుంచి ఇసుక లోడుతో వస్తున్న లారీ రఘుదేవపురం శివాలయం వద్ద నవీన్‌ను వెనుక నుంచి ఢీకొంది. దీంతో నవీన్ కుడిచెయ్యి విరిగి, ఎముక బయటకు వచ్చింది. పొట్టపై కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే లారీ డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యాడు. బాధిత కుటుంబసభ్యులు, స్థానికులు సందక సత్యవతి, తాడి పార్వతి, తాడి లక్ష్మి, తాడి సరోజిని, తాడి నాగలక్ష్మి, రాము, పిన్నింటి పైడిరాజు, కరిముంజి మాదవరావు, పిసినే రమణ, కొండ్రోతు రవి, కిర్ల శివ తదితరులు న్యాయం కోరుతూ ధర్నా చేపట్టి, రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. పరీక్షలు కావడంతో ఆర్టీసీ , స్కూల్, కాలేజీ బస్సులను మాత్రమే 10 గంటల వరకు వెళ్లేందుకు అనుమతిచ్చారు. తిరిగి వాహనాలను అడ్డుకున్నారు. సీతానగరం, రాజమహేంద్రవరం రోడ్డుపై అటు, ఇటు సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కోరుకొండ సీఐ మధుసూదనరావు, ఎస్సై ఎ.వెంకటేశ్వరావు, సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని ఆందోళన కారులతో చర్చించారు. అయినా వారు వినలేదు. ఓ దశలో రోడ్డుపై నుంచి ప్రజలను చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేయడానికి పోలీసులు ప్రయత్నించి విరమించారు. నార్త్‌జోన్ డీఎస్పీ ప్రసన్నకుమార్ అక్కడకు చేరుకుని స్థానికులతో చర్చించారు. ఇసుక లారీలను అడ్డుకుంటే అభ్యతరం లేదని, ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించిన పరికరాలను తీసుకెళుతున్న లారీలను అడ్డుకోవద్దని, సాయంత్రంలోగా లారీ యజమానిని పిలిపించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇచ్చారు. దీంతో స్థానికులు ఆందోళన విరమించారు. ప్రమాదానికి కారణమైన లారీని స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఉంచారు. గాయాలైన బాలుడు నవీన్‌ను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
వంగలపూడి ఇసుక ర్యాంపు నిలుపుదల
రఘుదేవపురంలో జరిగిన ఇసుక లారీ ప్రమాదంతో వంగలపూడి ఇసుక ర్యాంపులో లారీలపై ఇసుక ఎగుమతులు బుధవారం నిలిపివేశారు. ఇసుక లారీల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, న్యాయం జరిగే వరకు ఇసుక లారీలను అడ్డుకుంటామని స్థానికులు హెచ్చరించారు. వంగలపూడి ర్యాంపులో ఇసుక ఎగుమతులు నిలిపివేయాలని డీఎస్పీ ఆదేశాలతో కోరుకొండ సీఐ మధుసూదనరావు ర్యాంపును నిలుపుదల చేయించారు. బుధవారం ఇసుక ఎగుమతి నిలిచిపోయింది. ఎస్సై వెంకటేశ్వరావు, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement