ఇసుకార్జన
ఇసుకార్జన
Published Thu, Sep 8 2016 4:25 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
* ఇప్పటికే రూ.100 కోట్లు స్వాహ
* మరో రూ.100 కోట్లు టార్గెట్
* నిర్మాణం ప్రారంభమే కాని
* రోడ్డు పేరిట ఇసుక అక్రమ రవాణా
* నెల రోజులుగా య«థేచ్ఛగా వందల లారీల తరలింపు
* కాంట్రాక్టర్ పేరుతో అధికార పార్టీ నేత అడ్డగోలు దోపిడీ
వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం, సీడ్ క్యాపిటల్ యాక్సెస్ రోడ్డు నిర్మాణాలు అధికార పార్టీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ రెండు పేర్లు చెప్పి కృష్ణా నదిలోని ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ముచేసుకుంటున్నారు.
సాక్షి, అమరావతి బ్యూరో/ తుళ్లూరు రూరల్ : వంద వాహనాలు సచివాలయానికి సంబంధించిన ఉంటే.. వెయ్యి లారీలకుపైగా ఇతర ప్రాంతాలకు తరలించే వాహనాలు ఉంటున్నాయి. సచివాలయ నిర్మాణం కోసమని ఆరు నెలలుగా లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను వాహనాల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. సచివాలయం మాటున ఇసుక ద్వారా అధికారపార్టీ నేతలు సుమారు రూ.100 కోట్లు జేబులు నింపుకొన్నట్లు అంచనా. అంతటితో ఆగని అధికారపార్టీ నేతల దోపిడీ తాజాగా సీడ్ క్యాపిటల్ యాక్సెస్ రోడ్డును కూడా అక్రమ రవాణాకు వాడుకుంటున్నారు. రాజధాని ప్రాంతంలో 23 కిలోమీటర్ల మేర నిర్మించనున్న యాక్సెస్ రహదారి నిర్మాణానికి జూన్ 25న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంకటపాలెం సమీపంలో భూమిపూజ చేశారు. ఈ రహదారి నిర్మాణంలో భాగంగా 3 కిలో మీటర్ల ఫ్లై ఓవర్, ఎనిమిది లైన్ల మెట్రో ప్రాజెక్టు నిర్మించాల్సి ఉంది. కనకదుర్గ వారధి నుంచి దొండపాడు వరకు చేపట్టనున్న ఈ రహదారిని 9 నెలల్లో పూర్తి చేయాలి. అయితే ఇప్పటి వరకు యాక్సెస్ రహదారి నిర్మాణ పనులు ప్రారంభమే కాలేదు. అయితే అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు రహదారి నిర్మాణం కోసం మొదటి విడతగా 4 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమని కాంట్రాక్టర్ పేరుతో రెవెన్యూ, గనుల శాఖకు దరఖాస్తు చేసుకున్నారని విశ్వసనీయ సమాచారం. రహదారి కోసం అని చెప్పగానే అధికారులు కళ్లుమూసుకుని అనుమతులు ఇచ్చారని తెలిసింది.
మరో రూ.100 కోట్లు టార్గెట్..
అధికారపార్టీలోని ఓ వర్గం తాత్కాలిక సచివాలయం పేరుతో సుమారు రూ.100 కోట్లకుపైగా ఇసుక ద్వారా ఆర్జించారనే ప్రచారం జరుగుతోంది. మరో వర్గం నాయకులు యాక్సెస్ రోడ్డు నిర్మాణం పేరుతో మరో వంద కోట్ల వరకు ఇసుక ద్వారా సంపాదించాలనేది టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిసింది. అందులో భాగంగా ఉండవల్లి, లింగాయపాలెం, తాళ్లాయపాలెం, బోరుపాలెంతో పాటు మరికొన్ని‡రీచ్‌ల నుంచి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. అనుమతి 4 లక్షల క్యుబిక్ మీటర్లే అయినా... ఈ నెల రోజుల్లో రెండింతల ఇసుకను అక్రమ రవాణా చేసినట్లు విజిలెన్స్ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. టార్గెట్ పూర్తయ్యే వరకు ఎవరు అడ్డుపడినా... అక్రమ రవాణాను ఆపటానికి వీల్లేదని అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు అధికారులకు గట్టిగా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారులే గ్రామస్తుల వద్ద బహిరంగంగా చెప్పడం గమనార్హం. అయితే తాము చెప్పినట్లు ఎక్కడా చెప్పొద్దని ప్రాధేయపడుతున్నారు. ‘అనుమతులు ఉన్నా, లేక పోయినా మీరు, మేము ఏమీ చేయలేం’ అని స్థానిక గ్రామస్తులకు చెప్పి ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎదురు తిరిగితే మంచిగా పోలీస్టేçÙన్‌కు పిలిపించి కేసులు పెట్టి అరెస్టు చేయమని గట్టిగా చెప్పారని తేల్చిచెబుతున్నారు. దీంతో చేసేది లేక కొందరు గ్రామస్తులు అధికారపార్టీ నాయకులతో రాజీపడి వారి ఇచ్చే డబ్బులు జేబులో వేసుకుని మిన్నకుంటే... మరి కొందరు మాత్రం అధికారుల చుట్టూ తిరుగుతూ ఇసుక అక్రమ రవాణాను ఆపాలని కోరుతున్నారు. ఇంకొందరు ఇసుక అక్రమరవాణాకు సంబంధించిన ఆధారాలతో కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Advertisement
Advertisement