![ఇసుక దందా.. ‘అధికారికం’ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/51483636757_625x300.jpg.webp?itok=ESfMw9-6)
ఇసుక దందా.. ‘అధికారికం’
► ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు
►వేబిల్లులను మార్చుతున్న వైనం
► చోద్యంచూస్తున్న అధికార యంత్రాంగం
రామగుండం : ‘ఒకే వే బిల్లు... ఇష్టమొచ్చినన్ని ట్రాక్టర్ ట్రిప్పులు...’ అన్నట్లు సాగుతోంది జిల్లాలో ఇసుక దందా.. ఒకే వేబిల్లుతో అధికారిక ఇసుక రీచ్‌తోపాటు సమీప గోదావరిని తోడేస్తున్నారు. ఒకే వేబిల్లుపై తేదీలను దిద్ది ఇసుక తరలిస్తున్నారు. అంతర్గాం మండల పరిధిలోని గోలివాడ గోదావరినదిలోని అధికారిక ఇసుక రీచ్ ఇసుక అక్రమ దందాకు కేంద్ర బిందువవుతోంది. అయితే అధికారిక యంత్రాంగం చోద్యం చూస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. అంతర్గాం మండల పరి«ధిలో గతంలో ముర్మూర్, రాయదండి, గోలివాడ మూడు ఇసుక క్వారీలు ఉండేవి. వీటిని పరిశీలించిన భూగర్భశాఖఅధికారులు గోలివాడ శివారులో ఇసుక తరలింపుకు అనుకూలంగా ఉంటుందని అధికారికంగా ఆదేశాలు జారీచేశారు.
కరువైన నిఘా...
వే బిల్లుతో ఇసుక రీచ్‌లకు వెళ్లే ట్రాక్టర్లపై అధికారుల నిఘా కరువవడంతో ఓవర్ లోడ్‌తో ప్రధాన రహదారులన్నీ ఇసుకతో దర్శనమిస్తున్నాయి. ఇసుకలోడుతో క్వారీ నుంచి బయటకు వచ్చిన తర్వాత దానిపై రెవెన్యూ అధికారులు సైనాఫ్ చేస్తే అదే ట్రిప్పుతో వే బిల్లు గడువు పూర్తవుతుంది. అయితే పలు ట్రాక్టర్లపై పర్యవేక్షణ లేకపోవడంతో ఒకే తేదీతో జారీచేసిన వేబిల్లులపై దినమంతా ఇసుకను తరలిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
వేబిల్లును స్వీకరించి ఇతర రీచ్‌ల నుంచి...
అధికారికంగా జారీ చేసే వేబిల్లులను తీసుకుంటూ గోలివాడ రీచ్ నుంచి ఇసుక తరలించాలి. ఆరీచ్ దూరంగా ఉండడంతో ట్రాక్టర్ యజమానులు దగ్గరలో ఉండే రాయదండి, ముర్మూర్ గోదావరినది శివారు నుంచి ఇసుక తవ్వకాలను చేపడుతున్నారు. ఈ సమయంలో పోలీసులు చూసి పట్టుకుని పోలీస్‌స్టేన్ కు తరలించి జరిమానా వేసి వదిలిపెడుతున్నారు. ఈ నెలలో ఇలా 50 ట్రాక్టర్లను పట్టుకున్నట్లు అంతర్గాం ఎస్సై ప్రమోద్‌రెడ్డి తెలిపారు.
గోలివాడ ఇసుక రీచ్‌పై ‘సాక్షి’ పర్యవేక్షించగా.. వేబిల్లు వ్యవహారం బయటపడింది గత నెల ఓ వేబిల్లును 8వ తేదీన జారీ చేయగా.. సదరు ట్రాక్టర్ యజమాని 8 ముందు 2పెట్టడంతో 28వ తేదీగా మార్చుతూ మళ్లీ ఇసుకను తరలించేందుకు ట్రాక్టర్ క్వారీకి వచ్చింది. ఇలాంటి లోపభూయిష్టమైన పర్యవేక్షణతో ప్రభుత్వం కోట్లాది రూపాయల రెవెన్యూ నష్టపోయే ప్రమాదముంది.