కంట్లో ఇసుక కొట్టి.. | sand transport illigals | Sakshi
Sakshi News home page

కంట్లో ఇసుక కొట్టి..

Published Sun, Aug 21 2016 9:28 PM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

కంట్లో ఇసుక కొట్టి.. - Sakshi

కంట్లో ఇసుక కొట్టి..

  • పొరుగు రాష్ట్రాలకూ విచ్చలవిడిగా తరలింపు!
  • టన్నుకు రూ.600 చొప్పున వసూలు
  • తెలుగు తమ్ముళ్ల ఇసుక దందా తీరిది..
  • పట్టించుకోని అధికార యంత్రాంగం
  •  
    సూక్ష్మమైనా సరే మాకు ‘మోక్షం’ ఉండాల్సిందేనన్నది తెలుగు తమ్ముళ్ల లక్ష్యం. ఇసుకను ఉచితంగా అందిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. అందులో కూడా ‘తమ్ముళ్లు’ లాభాల వేట సాగిస్తున్నారు. తెలంగాణ  సహా సుదూర ప్రాంతాలకు అధిక ధరకు ఇసుక ఎగుమతులు భారీగా దండుకుంటున్నారు. ఇందుకు కడియం మండలంలోని వేమగిరి ఇసుక ర్యాంపు వేదికగా నిలుస్తోంది.
      – ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం)
     
    జిల్లాలో ప్రధాన ర్యాంపులన్నీ దాదాపు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో హైవేకు అతి సమీపంలో ఉన్న వేమగిరి ర్యాంపు నుంచి తెలుగు తమ్ముళ్ల ఇసుక దందా కొనసాగుతోంది. ఇక్కడి నుంచి చిన్న లారీల్లో ఇసుకను తరలించి, ఖాళీ ప్రదేశాల్లో పెద్ద లారీల్లోకి లోడింగ్‌ చేస్తున్నారు. ఇందుకు విస్తృత నెట్‌వర్క్‌నూ ఏర్పాటు చేసుకున్నారు.
    దోపిడీ విధానం ఇదీ..
    వేమగిరి ఇసుక ర్యాంపులో చిన్న లారీల్లో ఇసుకను ఎగుమతి చేస్తున్నారు. అక్కడి నుంచి రాజమహేంద్రవరం రూరల్‌ మండలంలోని బొమ్మూరు, హుకుంపేట తదితర గ్రామాలకు సమీపంలోని ఓ ఖాళీ ప్రదేశానికి తరలిస్తున్నారు. పొక్లెయిన్ల ద్వారా ఇసుకను పెద్ద లారీల్లోకి లోడింగ్‌ చేసి, తెలంగాణలోని హైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాలకు చేరవేస్తున్నారు. రెండు యూనిట్ల లారీని వేమగిరి ర్యాంపులో రూ.2,500కు కొనుగోలు  చేస్తున్నట్లు అక్కడి వ్యాపారులు చెబుతున్నారు. ఇది సుమారు 8 నుంచి 11 టన్నుల వరకుంటుంది. హైదరాబాద్‌కు తీసుకువెళ్లే లారీలకు ఇదే ఇసుకను టన్ను రూ.600 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ లెక్కన 8 టన్నులకు రూ.4,800లు, 11 టన్నులకు రూ.6,600లు లభిస్తాయి. కొనుగోలు ఖర్చు రూ.2,500 పోను మిగిలిన మొత్తం అక్రమార్కుల జేబుల్లోకి చేరుతోంది. రోజుకు 30 వరకు పెద్ద లారీలను ఇతర రాష్ట్రాలకు పంపుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ లెక్కన ఈ అక్రమ దందాలో రోజుకు రూ.2 లక్షల వరకు మిగులుతోందని అంచనా.
    పేదలకేనని ప్రకటించినా..
    కోట్లాది రూపాయల ఆదాయాన్ని వదులుకుని ఇసుకను ఉచితంగా ఇస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతోంది. ఉచిత ఇసుక పేరిట సవాలక్ష ఆంక్షలు పెట్టి, పెత్తనాన్ని అధికారులకు అప్పగించింది. ఈ ఉచిత ఇసుక పేదలకు అందకుండా, అక్రమ రవాణాతో ‘పెద్దల’ జేబుల్లోకి చేరుతోంది. ఇసుకను నిల్వ చేసినా నేరమంటూ చెప్పే అధికారులు.. ఈ అక్రమ దోపిడీని మాత్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ రవాణాకు ఉద్దేశించిన లారీలే ర్యాంపుల్లో నిత్యం వరుసలు కట్టి కనిపిస్తున్నాయి.
    అధికారుల ప్రేక్షకపాత్ర
    ఇసుక ర్యాంపులో లోడు చేస్తున్నప్పుడు కానీ, ర్యాంపుతో సంబంధం లేకుండా ఒకేచోటికి లారీలు వెళుతున్నప్పుడు కానీ రెవెన్యూ అధికారులకు కనీసం సందేహం రాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజమహేంద్రవరం రూరల్‌ మండలంలోని అనేకచోట్ల ఇసుక లారీలు వరుసగా నిలిపిఉంచడం, పొక్లెయిన్లను వినియోగించి లారీల్లోకి లోడు చేస్తున్నప్పటికీ అధికారుల నుంచి అభ్యంతరాలు రాకపోవడం దీనికి బలం చేకూరుస్తోంది. దీనిపై వివరణకు అధికారుల కోసం ప్రయత్నించగా, అందుబాటులో లేరు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement