ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సత్తుపల్లి కేంద్రంగా జిల్లాలో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కాబోతోంది. రాష్ట్ర భూ పరిపాలన కమిషనర్ (సీసీఎల్‌ఏ) కార్యాలయం ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం జిల్లాలో 47 మండలాలకు నాలుగు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఖమ్మంలో 17 మండలాలు, పాల్వంచలో 10 , భద్రాచలంలో 8 , కొత్తగూడెంలో 11 మండలాలతో డివిజన్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఖమ్మం రెవెన్యూ డివిజన్ పరిధిలో 17 మండలాలు ఉండటంతో పాలనా పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు డివిజన్ చివర్లో ఉన్న మండలాలకు వెళ్లడం ఇబ్బంది అవుతోంది. గతంలో ప్రజా ప్రతినిధులు కల్లూరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని పలుమార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆ విషయం మరుగునపడింది.
తాజాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో మళ్లీ ప్రభుత్వం పాలనా పరమైన ఇబ్బందులను తొలగించేందుకు, జనాభా, భౌగోళిక విస్తీర్ణం దృష్ట్యా మరో నూతన డివిజన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రక్రియ మొదలైంది. దీనిలో భాగంగానే సత్తుపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేశ్ ఫైల్ సిద్ధం చేస్తున్నారు. ఈ ఫైల్‌కు గ్రీన్‌సిగ్నల్ లభిస్తే జిల్లాలో రెవెన్యూ డివిజన్‌ల సంఖ్య ఐదుకు చేరుతుంది.
డివిజన్ ఇలా....
జిల్లాలో నూతనంగా సత్తుపల్లి రెవెన్యూ డివిజన్‌ను ఎనిమిది మండలాలతో ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు. ఖమ్మం డివిజన్‌లో 17 మండలాలకు ఆరు, పాల్వంచ డివిజన్‌లోని పది మండలాలకు రెండింటితో ఈ నూతన డివిజన్ ఏర్పడనుంది. అదే జరిగితే ఖమ్మం డివిజన్‌లో 11, పాల్వంచ డివిజన్‌లో 8 మండలాలు మాత్రమే ఉంటాయి. ఖమ్మం డివిజన్‌లోని మండలాలైన కల్లూరు, సత్తుపల్లి, వైరా, తల్లాడ, పెనుబల్లి, వేంసూరు, పాల్వంచ డివిజన్‌లోని దమ్మపేట, అశ్వారావుపేట మండలాలతో కొత్తగా సత్తుపల్లి రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పడనుంది. ఈ డివిజన్ పరిధిలోనికి సత్తుపల్లి, అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాలు రానున్నాయి. కొత్తగా రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయాలనుకునే మండలాల్లో జనాభా, భౌగోళిక విస్తీర్ణం తదితర వివరాలను జిల్లా అధికారులు సేకరిస్తున్నారు. నూతన డివిజన్ విస్తీర్ణం, నైసర్గిక స్వరూపం ఎలా ఉంటుందనే ఆధారాలతో కూడిన మ్యాప్‌ను పంపాలని స్థానిక అధికారులను ఆదేశించారు. అధికారులు ఆయా వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వారం రోజుల్లో జిల్లాస్థాయిలో కసరత్తు పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి.
గతంలో కల్లూరు కేంద్రంగా ప్రతిపాదనలు
జిల్లాలో కల్లూరు కేంద్రంగా వైరా, తల్లాడ, పెనుబల్లి, వేంసూరు, సత్తుపల్లి, దమ్మపేట, అశ్వారావుపేటలతో నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని పదేళ్ల క్రితమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. కల్లూరు కాకుండా సత్తుపల్లిలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తేనే అనుకూలంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పాలనాపరమైన అంశాలతోపాటు నియోజకవర్గ కేంద్రంలో రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేస్తే అధికారులు అందరూ అందుబాటులో ఉంటారని చెబుతున్నారు. నూతన భవన నిర్మాణాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదని, పాత భవనాల్లోనే పాలన కొనసాగించేందుకు వీలుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇలా పలురకాల కారణాలతో సత్తుపల్లి కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారని సమాచారం.