పోలీసు శాఖ పరువు తీయొద్దు
పోలీసు శాఖ పరువు తీయొద్దు
Published Fri, Dec 30 2016 10:37 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
– ఆరోపణలు ఎక్కువయ్యాయి
- విచారణలో బయట పడితే వీఆర్‌కు
– నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ హెచ్చరిక
కర్నూలు : పోలీసు శాఖలో అవినీతి పెరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. సంపాదన లక్ష్యంగా కొందరు పనిచేస్తున్నారన్న విమర్శలు ఎక్కువయ్యాయి... పోలీసు శాఖ పరువు తీయొద్దు... పోలీస్‌స్టేషన్లకు ఆకస్మికంగా తనిఖీకి వస్తాను.. విచారణలో అవినీతి ఆరోపణలు బయటపడితే వేటు తప్పదని ఎస్పీ ఆకె రవికృష్ణ క్షేత్రస్థాయి పోలీసు అధికారులను హెచ్చరించారు. శుక్రవారం ఉదయం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సబ్ డివిజన్ అధికారులు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రవర్తన మార్చుకోకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. నేరాల నియంత్రణే లక్ష్యంగా వచ్చే ఏడాది పనిచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా మహిళలపై జరిగే నేరాలు, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు తగ్గించే లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని పనిచేయాలని సూచించారు. శాంతి భద్రతల దృష్ట్యా నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా వెనుకబాటుకు ప్రధాన కారణమవుతున్న రౌడీయిజం, ఫ్యాక్షనిజం, ట్రబుల్ మాంగర్స్‌పై ఉక్కుపాదం మోపాలన్నారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా వ్యవహరించాలన్నారు. డ్రంకన్ డ్రైవ్ ఉద్ధృతం చేయడం ద్వారా ఒక్క రోడ్డు ప్రమాదం కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్‌ఐలు, సీఐలు దత్తత తీసుకున్న 78 గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అక్కడి ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. గస్తీలు నిర్వహించేందుకు ఈ–బీట్ విధానం విధిగా అమలు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. కృష్ణా పుష్కరాల్లో ఉత్తమ సేవలందించిన సిబ్బందికి జనవరి మొదటి వారంలో ప్రశంసాపత్రాలు అందజేయాలన్నారు.
పెద్దకడుబూరులో జరిగిన చిట్టెమ్మ హత్యకేసుకు సంబంధించి నేర దర్యాప్తులో రాష్ట్రస్థాయిలోనే రెండో స్థానం కర్నూలు జిల్లాకు వచ్చినందుకు సంబంధిత అధికారులను సన్మానించారు. ఎలాంటి ఆధారాలు లేని చిట్టెమ్మ కేసును దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసేందుకు కృషి చేసిన ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు, కోసిగి సీఐ కంబగిరి రాముడు, ఎస్‌ఐ ఇంతియాజ్, వారికి సహకరించిన ఫింగర్‌ప్రింట్స్ సిబ్బంది, వీఆర్వో తలారి తదితరులను ఎస్పీ అభినందించి సన్మానించారు. ఫింగర్ ప్రింట్స్ సీఐ, ఏఎస్‌ఐలకు ప్రశంసాపత్రాలను అందజేశారు. హోంమంత్రి, డీజీపీ నుంచి నేర పరిశోధన అవార్డు జిల్లాకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు రమణమూర్తి, బాబు ప్రసాద్, ఎ.జి.కృష్ణమూర్తి, వెంకటాద్రి, ఈశ్వర్‌రెడ్డి, హరినాథరెడ్డి, కొల్లి శ్రీనివాసులు, మురళీధర్, వినోద్‌కుమార్, రాజశేఖర్‌రాజు, బాబా ఫకృద్దీన్, సుప్రజ, రామచంద్ర, హుసేన్‌పీరాతో పాటు సీఐలు పాల్గొన్నారు.
Advertisement