మోపిరెడ్డిపల్లెలో వేరుశనగ పంట సందర్శిస్తున్న ఎమ్మెల్యే నారాయణస్వామి
–తక్షణమే ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించాలి
–వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ స్వామి డిమాండ్
పెనుమూరు:
ఐదేళ్లుగా వేరుశనగ రైతులు పంట నష్టపోతున్నా ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి ఆందోళన వ్యక్తంచేశారు. మంగళవారం గడప గడపకూ వెళ్తూ మోపిరెడ్డిపల్లె, ఉగ్రాణంపల్లె, మనబోటు పల్లె గ్రామాల్లో ఎండుతున్న వేరుశనగ పంటలను ఆయన పరిశీలించారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో భారీ వర్షాలు కురవడంతో రైతులు 1.21 లక్షల హెక్టార్లలో వేరుశనగను సాగు చేస్తున్నారని చెప్పారు. సకాలంలో వర్షాలు లేక పంట పూర్తిగా ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ముందస్తుగా వేసిన పంటలో చెట్టుకు రెండు, మూడు కాయాలు కూడా దిగుబడి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఎకరా పొలంలో వేరుశనగ సాగుకు రూ. 15 వేలు వరకు రైతులు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో నీరున్నా ఎన్నడూ లేని విధంగా ఆగస్టు నెలలో సగటు ఉష్ణోగ్రత 38 డిగ్రీలు నమోదు కావడంతో వేరుశనగ పంటను రైతులు కాపాడుకోలేక అవస్థలు పడుతున్నారన్నారు.
వేరుశనగ పంటలను పరిశీలించి రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని కలెక్టరును నారాయణస్వామి డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబునాయుడు పాలనలో అతివృష్టి ... అనావృష్టిల కారణంగా రైతులు నష్టపోతున్నారని వ్యాఖ్యానించారు. గతంలో తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో వర్షాలు లేక ప్రజలు కరువుతో అల్లాడిపోయారని నారాయణస్వామి గుర్తు చేశారు. తాజాగా రెండు సంవత్సరాలుగా పాలనలో తుపాన్ల ప్రభావంతో కురిసిన అకాల వర్షాలతో కంది, వరి, పూల రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. గత ఏడాది వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదు కోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. జిల్లా పార్టీ నేత వెంట పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు దూది మోహన్, రైతు విభాగం అధ్యక్షులు గోవిందరెడ్డి, యువత అధ్యక్షులు మురళీ కుమార్‌రెడ్డి, మోపిరెడ్డిపల్లె మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి, రాజారెడ్డి, రవినాయుడు తదితరులు పాల్గొన్నారు.