
ఆశాభట్
ఆధునిక రవాణా వ్యవస్థకు అనుగుణంగా డిజైన్, టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ నూతన ఆవిష్కరణలు చేస్తున్నామని యమహా మోటార్ ఇండియా సేల్స్ ..
♦ రాష్ట్రంలో తొలి స్కూటర్ బొటిక్ ప్రారంభం
♦ ప్రత్యేక ఆకర్షణగా మిస్ సుప్రానేషనల్ ఆశాభట్
విశాఖసిటీ : ఆధునిక రవాణా వ్యవస్థకు అనుగుణంగా డిజైన్, టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ నూతన ఆవిష్కరణలు చేస్తున్నామని యమహా మోటార్ ఇండియా సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ మసాకీ అసానో అన్నారు. ప్రపంచంలోనే రెండోది, రాష్ట్రంలో మొదటి యమహా స్కూటర్ బొటిక్‌ను నగరంలోని బిర్లా జంక్షన్ సమీపంలో ఎండీ అసానోతోపాటు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాయ్ కురియన్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో మిస్ సుప్రా నేషనల్–2014 ఆశాభట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఎండీ మసాకీ అసానో మాట్లాడుతూ స్కూటర్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో స్కూటర్ బొటిక్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మహిళల్లో స్కూటర్ సవారీపై ఆసక్తి ఎక్కువైందనీ..
ఈ సమయంలో వారికి సేవలందించేందుకు బొటిక్‌లో స్కూటర్ క్లినిక్ సైతం ఉంటుందని వివరించారు. స్కూటర్ మోడల్, కొనుగోలు చేసిన వ్యక్తిని బట్టి.. ఫ్యాషన్ ప్రపంచం బొటిక్‌లో అందుబాటులో ఉంటుందని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాయ్ కురియన్ తెలిపారు. అత్యుత్తమ కస్టమర్ అనుసంధానంతో యంగ్ బ్రాండ్‌గా, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్‌లో యమహా వాహనాల పాత్ర శ్లాఘనీయమని కొనియాడారు. డీలర్ల ఆసక్తి, వారి అంకిత భావాన్ని దృష్టిలో పెట్టుకొని నగరాల్లో బొటిక్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా బొటిక్‌లో కొనుగోలు చేసిన ఇద్దరు కస్టమర్లకు డెలివరీ అందించారు. ఈ కార్యక్రమంలో వైష్ణవీ ఆటోమొబైల్స్ ప్రొప్రైటర్ దశరధరామిరెడ్డి, యమహా సిబ్బంది పాల్గొన్నారు.