చిన్నారులపై ‘సీజనల్’ పడగ
చిన్నారులపై ‘సీజనల్’ పడగ
Published Sun, Jul 31 2016 10:52 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
– విజృంభిస్తున్న వైరల్ ఫీవర్లు
– ఆసుపత్రులకు క్యూ కడుతున్న తల్లిదండ్రులు
– ప్రబలుతున్న అతిసారం, టైఫాయిడ్
–జిల్లాలో అనుమానిత డెంగీ జ్వరాలు
కర్నూలు(హాస్పిటల్): ఆడుతూ పాడుతూ తిరిగే చిన్నారులు ఉన్నపలంగా మంచానపడుతున్నారు. విపరీతమైన జ్వరం, కళ్లు ఎర్రగా కావడం, ఒళ్లంతా నొప్పులతో అల్లాడుతున్నారు. దీనికితోడు జలుబు, దగ్గు సరేసరి. ఇలాంటి లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చే చిన్నారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీనికితోడు ఇప్పటికే పక్క జిల్లా కడపలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వర్షాలు ఈసారి బాగానే కరుస్తుండటం, వాతావరణం సైతం ఎప్పుడూ చల్లగా ఉండటంతో వైరస్‌లు విజృంభిస్తున్నాయి. వర్షపునీరు, ఇతర వ్యర్థాలు తోడై భూమి పొరల్లోని వైరస్‌లు, బ్యాక్టీరియా విస్తృతమై ముందుగా వ్యాధినిరోదక శక్తి తక్కువగా ఉన్న చిన్నారులపై దాడి చేస్తున్నాయి. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల విభాగానికి ప్రతిరోజూ 200లకు పైగా చిన్నపిల్లలు ఓపీ చికిత్సకు వస్తున్నారు. అందులో 100కు పైగా వైరల్‌ఫీవర్ కేసులే ఉంటున్నాయి. రోజూ 25 నుంచి 30 మంది దాకా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఇక ప్రై వేటు చిన్నపిల్లల వైద్యుల వద్దకు సైతం ఇంతే నిష్పత్తిలో చిన్నపిల్లలు వైరల్‌ఫీవర్లతో వెళ్తున్నారు. కర్నూలులో 40 మందికి పైగా చిన్నపిల్లల వైద్యనిపుణులు ఉన్నారు. ఇక నంద్యాల, ఆదోనిలలోనూ వీరి సంఖ్య మరో 50 దాటుతోంది. ప్రతి ఒక్కరి వద్దా ఈ సీజన్‌లో రోజూ 30 నుంచి 50 మంది దాకా వైరల్‌ఫీవర్లతో పిల్లలు చికిత్స కోసం వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీనికితోడు కలుషిత నీరు తాగడంతో టైఫాయిడ్, అతిసారం, పచ్చకామెర్లు వంటి వ్యాధులు సైతం ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. గత నెలలో కడప జిల్లాకు చెందిన డెంగీ అనుమానిత పిల్లల రక్తాన్ని పరీక్ష నిమిత్తం పంపగా 40 మందిలో 22 మందికి ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఓ చిన్నారికి ఈ వ్యాధి ఉన్నట్లు తేలింది. ఈ నెలకు సంబంధించి ఇప్పటికే 40కి పైగా రక్తపు నమూనాలను పరీక్షకు కర్నూలు మెడికల్‌కాలేజిలోని మైక్రోబయాలజి డిపార్ట్‌మెంట్‌కు పంపించారు. మరో రెండు రోజుల్లో ఈ నివేదికలు వచ్చే అవకాశం ఉంది. అయితే డెంగీ లక్షణాలతో ఆసుపత్రిలో చేరే చిన్నపిల్లల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
–సాధ్యమైనంత వరకు పిల్లలను చల్లని వాతావరణానికి దూరంగా ఉంచాలి.
–శుభ్రమైన గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి.
–కాచిచల్లార్చిన నీటిని, ఫ్యూరిఫైడ్(శుద్ధిచేసిన) నీటిని మాత్రమే తాగించాలి.
–తాగునీటిని శుభ్రపరిచేందుకు ఒక బిందె నీళ్లలో ఒక క్లోరిన్ బిళ్లను వేసి, అరగంట తర్వాత ఆ నీటిని తాగాలి.
–జనసమర్దం అధికంగా ఉండే ప్రాంతాల్లో పిల్లలను తీసుకోకపోవడమే మంచిది.
–ఇంట్లోకి దోమలు రాకుండా చూసుకోవాలి. పిల్లలు పడుకునే గదుల్లో దోమతెరలు ఉపయోగించాలి.
–మలవిసర్జన తర్వాత, భోజనానికి ముందు చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి.
–తినే ఆహారంపై తప్పనిసరిగా మూతలు ఉంచాలి.
–వేడిగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తినాలి. నిల్వ ఉన్న ఆహారాన్ని, బాగా మగ్గిన పండ్లను తినకూడదు.
–రోడ్లపై తినుబండారాలకు దూరంగా ఉండటమే మేలు.
– ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
సీజనల్ వ్యాధులను అశ్రద్ధ చేయొద్దు
–డాక్టర్ జి. రమాదేవి, చిన్నపిల్లల వైద్యులు, పెద్దాసుపత్రి
సీజనల్‌లో చిన్నపిల్లలకు వచ్చే వ్యాధులను ఏ మాత్రం అశ్రద్ధ చేయకూడదు. వెంటనే సమీపంలోని వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. జలుబు, దగ్గు, జ్వరం, విపరీతమైన ఒళ్లునొప్పులతో కూడిన జ్వరం ఉంటే వైద్యులను సంప్రదించాలి. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల వైరస్ క్రిములు, బ్యాక్టీరియా కారక వ్యాధులు అధికంగా వస్తున్నాయి. ఆసుపత్రిలో శుక్ర, శనివారాల్లో సాధారణంగా ఓపీ తక్కువగాఉంటుంది. కానీ ఈ రెండురోజుల్లో ఓపీ బాగా పెరిగింది.
Advertisement
Advertisement