
నోటుకు సీటు!
ఆదర్శ పాఠశాలలో మెరిట్ ముసుగులో సీట్ల అమ్మకం
- రూ.10వేల నుంచి రూ.15వేలు వసూలు
- ఒప్పందం మేరకు వాట్సాప్‌లో ప్రశ్న, జవాబు పత్రాలు
- ప్రిన్సిపాల్, మరో ఇద్దరు ఉపాధ్యాయుల పాత్ర
- వేకెన్సీ సీట్ల భర్తీలో రిజరేషన్‌కు పాతర
- అమ్ముడుపోయిన సుమారు 70 సీట్లు
- ‘సాక్షి’ నిఘాలో బట్టబయలు
ఆదర్శం అభాసు పాలయింది. విద్యార్థులకు తప్పొప్పులు తెలియజెప్పాల్సిన ఉపాధ్యాయులే తప్పటడుగులు వేశారు. జీవితం సాఫీగా సాగిపోయేందుకు అవసరమైన జీతం వస్తున్నా.. గీతం కోసం అర్హులైన విద్యార్థులకు వెన్నుపోటు పొడిచారు. ప్రయివేట్ పాఠశాలలను కాదని.. ఆదర్శ పాఠశాలల్లోనే తమ పిల్లల భవిష్యత్ బాగుంటుందని ఆశించిన తల్లిదండ్రుల కలనూ కాలరాశారు. మెరిట్.. రిజర్వేషన్ ప్రాతిపదికన భర్తీ చేయాల్సిన సీట్లను అమ్మకానికి పెట్టడంతో సరస్వతీ మాత కన్నీరు పెడుతోంది.
రాయదుర్గం అర్బన్ : పట్టణంలోని ఆదర్శ పాఠశాలలో సీటుకు బాగా డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో పరీక్ష తప్పనిసరి చేశారు. ఆరో తరగతిలో 80 సీట్ల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షలో దాదాపు 400 మంది విద్యార్థులు హాజరువుతుండటం చూస్తే పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక్కో తరగతికి 80 సీట్ల చొప్పున మంజూరు చేయగా, గత ఏడాది ప్రజాప్రతినిధులపై విపరీతమైన ఒత్తిడి రావడంతో ఆరో తరగతికి అదనంగా మరో 80 సీట్లను మంజూరు చేశారు. ఒకసారి ఆరో తరగతిలో చేరిలో ఇంటర్మీడియట్ వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదనే అభిప్రాయం తల్లిదండుల్లో ఉంది. కాన్వెంట్లలో చదివించే తల్లిదండ్రులు కూడా ఆదర్శ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో దళారులు, ఇద్దరు ఉపాధ్యాయులు సొమ్ము చేసుకునేందుకు సిద్ధపడ్డారు. సీటుకు రూ.10వేల నుంచి రూ.15వేల చొప్పున సుమారు 70 సీట్లను అమ్మకున్నట్లు తెలిసింది. డబ్బిచ్చిన వారికి వాట్సాప్‌లో ముందుగానే ప్రశ్న, జవాబు పత్రాలు పంపుతున్నారు. అది కూడా రాయలేని వారికి వారే దిద్దుబాట్లు చేసి పంపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కారణంగా మెరిట్ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఎవరైనా గుర్తించి ప్రశ్నిస్తే నిబంధనలకు విరుద్ధంగా సీట్లు కేటాయించి నోరు మూయిస్తున్నట్లు తెలుస్తోంది.
వెలుగులోకి వచ్చిందిలా..
ఆదర్శ పాఠశాలలో పెద్ద ఎత్తున సీట్ల కోసం డబ్బు వసూలు చేస్తున్నారనే విషయమై బహిరంగంగానే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ దృష్టి సారించగా వాయిస్ రికార్డులతో పాటు, రిజర్వేషన్ రోస్టర్ వెల్లడితో అడ్డంగా దొరికిపోయారు. వివిధ తరగతుల్లో ఖాళీగా ఉన్న 13 సీట్లను భర్తీ చేయడానికి గత నెల 24న రిజర్వేషన్ రోస్టర్‌ను ప్రిన్సిపాల్ ప్రకటించారు. జాబితా ప్రకారం ఏడో తరగతిలో ఆరు సీట్లు, ఎమిమిదో తరగతిలో మూడు సీట్లు, తొమ్మిదో తరగతిలో 4 సీట్లు ఉన్నాయి. వీటికి దరఖాస్తులు స్వీకరించారు. జాబితాలో పదో తరగతిలో సీట్లు చూపకపోయినప్పటికీ దరఖాస్తులు స్వీకరించారు. కేవలం రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం దరఖాస్తులు స్వీకరించకుండా, అందరితోనూ దరఖాస్తులు స్వీకరించడం చర్చనీయాంశమైంది. వీరికి ఈ నెల 5వ తేదీన పరీక్షలు నిర్వహించారు. డబ్బు ఇచ్చిన వారికి ముందుగానే వాట్సాప్‌లో ప్రశ్నాపత్రాన్ని, జవాబు పత్రాన్ని పంపించారు. నాలుగో తేదీ సాయంత్రం 4.25 గంటలకు ఒక వ్యక్తికి ç ప్రశ్నాపత్రం పంపగా, 5వ తేదీ ఉదయం 7.34 గంటలకు అదే వ్యక్తికి జవాబు పత్రం కూడా ప్రిన్సిపాల్ సెల్ నుంచి వెళ్లింది.
ఖాళీ సీట్ల భర్తీకి పాటించాల్సిన రిజర్వేషన్ వివరాలివీ..
నోటిఫికేషన్ ప్రకారం గత నెల 24న ప్రకటించిన ఖాళీలకు రిజర్వేషన్ వివరాలను ప్రిన్సిపాల్ విడుదల చేశారు. ఏడో తరగతిలో ఉన్న ఆరు సీట్లలో ఒకసీటు ఎస్సీ జనరల్ , మూడు సీట్లు ఎస్సీ ఉమెన్, ఒక సీటు ఎస్టీ ఉమెన్, ఒక సీటు బీసీ–బీ ఉమెన్‌కు కేటాయించారు. ఎనిమిదో తరగతిలోని మూడు సీట్లలో ఓసీ ఉమెన్‌కు ఒకటి, ఎస్సీ ఉమెన్‌కు ఒక సీటు, బీసీ–డీ జనరల్‌కు ఒక సీటు కేటాయించారు. తొమ్మిదో తరగతిలోని నాలుగు సీట్లలో ఎస్సీ జనరల్‌కు ఒక సీటు, ఎస్సీ ఉమెన్‌కు ఒక సీటు, ఎస్టీ ఉమెన్‌కు ఒక సీటు, బీసీ–డీ ఉమెన్‌కు ఒక సీటు కేటాయించారు. ఈ సీట్లకు 178 మంది దరఖాస్తు చేసుకున్నారు.
విద్యార్థుల ఎంపిక చేశారిలా..
ఈనెల 12న వేకెన్సీ సీట్ల భర్తీకి సంబంధించిన ఫలితాలను వెల్లడించారు. అయితే రిజర్వేషన్‌కు, ఫలితాలకు పొంతన లేకుండా పోయింది. ఏడో తరగతిలో ఆరు సీట్లకు గాను ఓసీ కేటగిరీ కింద ఇద్దరు బాలురు, బీసీ–బీ కింద ఒక బాలుడు, బీసీ–డీ కింద ఒక బాలుడు, ఒక బాలికను, బీసీ–ఏ కింద ఒక బాలుడిని ఎంపిక చేశారు. 8వ తరగతికి ఎంపిక చేసిన ముగ్గురిలో బీసీ–బీ కింద ఇద్దరు బాలురు, ఓసీ కింద బాలికను ఎంపిక చేశారు. 9వ తరగతిలో బీసీ–బీ కింద ఇద్దరు బాలురు, ఒక బాలికను, బీసీ–డీ కింద ఒక బాలికను ఎంపిక చేశారు. 10వ తరగతికి వేకెన్సీలో చూపకపోయినప్పటికీ ఒక సీటు ఖాళీగా ఉందంటూ ఓసీకి చెందిన బాలుడిని ఎంపిక చేశారు.
ఫలితాల్లో రిజర్వేషన్లకు తిలోదకాలు
వేకెన్సీ సీట్ల కోసం ఈ నెల 5వ తేదీన 176 మంది పరీక్ష రాయగా, 13 మందిని ఎంపిక చేశారు. అయితే రిజర్వేషన్లకు తిలోదకాలు ఇవ్వడంతో వ్యవహారం బట్టబయలైంది. విషయాన్ని పసిగట్టిన ‘సాక్షి’ లోతుగా అధ్యయనం చేసింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రిన్సిపాల్.. ప్రస్తుతం, అంతకు ముందు ఎంపికైన ఆరవ తరగతి విద్యార్థులతో స్థానిక ఎమ్మెల్యేల రెకమండేషన్ లెటర్ తీసుకురావాలని ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం.
ఎవరితోనూ డబ్బు తీసుకోలేదు
మెరిట్ ప్రాతిపదికనే ఎంపిక ప్రక్రియ చేపడుతున్నాం. సీట్ల కోసం ఎవరితోనూ డబ్బు తీసుకోలేదు. మంచి మార్కులు వచ్చిన వారికే అవకాశం కల్పించాం. రిజర్వేషన్ రోస్టర్ ప్రకటించకుండా ఉండాల్సింది.
- ప్రకాశ్‌నాయుడు, ప్రిన్సిపాల్, ఆదర్శ పాఠశాల, రాయదుర్గం