
బాలికను రెండో పెళ్లి చేసుకున్న ఘనుడు
♦ కిడ్నాప్, అత్యాచారం కేసులు నమోదు
♦ వేధింపులు భరించలేక
♦ విడాకులు తీసుకున్న మొదటి భార్య
కౌడిపల్లి: ప్రేమ పేరుతో బాలికను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న వ్యక్తిపై కిడ్నాప్, అత్యాచారం కేసు నమోదు చేసినట్లు నర్సాపూర్ సీఐ తిరుపతిరాజు తెలిపారు. శుక్రవారం నిందితుడిని అరెస్టు చేసిన సందర్భంగా విలేకరులతో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మండలంలోని రాయిలాపూర్ తండాకు చెందిన నునావత్ చందర్ అతడి భార్య, కూతురు(15)తో కలిసి హత్నూరలో కూలీ పనులు చేస్తున్నాడు. కాగా ఈ నెల 3న ఆ బాలిక స్వగ్రామానికి వెళ్లి తిరిగి వస్తానని చెప్పి వెళ్లింది. కానీ తిరిగి వెళ్లలేదు. దీంతో 16న బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు బాలిక అదృశ్యం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా ఏఎస్‌ఐ ఖలీమొద్దీన్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టగా మండలంలోని సలాభత్‌పూర్ తండాకు చెందిన నునావత్ రవీందర్ (24) బాలికను ప్రేమ పేరుతో తీసుకెళ్లి రాజేంద్రనగర్ చింతల్‌మేట్‌లో పెళ్లిచేసుకుని కాపురం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో రవీందర్‌ను అరెస్టు చేసి బాలికను పెళ్లిచేసుకుని శారీరక సంబం ధం పెట్టుకోవడంతో అతడిపై కిడ్నాప్, అత్యాచారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.
గతంలోనే రవీందర్‌పై కేసు..
ఇదిలా ఉండగా రవీందర్‌కు 2013లో శివ్వంపేట తండాకు చెందిన మహిళతో పెళ్లి జరిగింది. కాగా భార్య ఉండగానే సలాభత్‌పూర్ తండాకు చెందిన మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెను ఎత్తుకెళ్లాడు. దీంతో ఈ విషయంలో రవీందర్‌పై గతంలోనే కేసు నమోదు అయింది. ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకొని భార్యను వేధించేవాడు. భరించలేని భార్య గత ఏడాది రవీందర్‌తో విడాకులు తీసుకుంది.