ముస్తాబు చేసిన దర్గాముఖద్వారం
గూటుపల్లెలో మతసామరస్య పరిమళం
Published Wed, Nov 23 2016 11:01 PM | Last Updated on Fri, Aug 24 2018 6:44 PM
- 26 నుంచి ఉరుసు
- హాజరుకానున్న మహారాష్ట్ర, గోవా, కర్ణాటక భక్తులు
గూటుపల్లె (బేతంచెర్ల): ఇద్రూస్‌బాషా ఉరఫ్ పెద్దరాజుల స్వామి ఉరుసుకు బేతంచెర్ల మండలం గూటుపల్లె గ్రామం సిద్ధమైంది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఉరుసును.. ఈ నెల 26, 27, 28 తేదీల్లో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలకు రాష్ట్రంలోని భక్తులే కాకుండా మహారాష్ట్ర, గోవా, కర్ణాటక ప్రాంతాల నుంచి వేలాది మంది రానున్నారు.
ఇదీ చరిత్ర..
పెద్దరాజుల స్వామి.. 600 సంవత్సరాల క్రితం సౌది అరేబియా దేశంలోని జిద్దా సమీపంలో గల అదన్ పట్టణంలో సయ్యద్ అబూబకర్ సుభాన్ ఇద్రూస్ వలి మక్కికు జేష్ట పుత్రుడుగా జన్మించారు. లోక కళ్యాణార్థం తొమ్మిదేళ్ల వయస్సులోనే తన తల్లిదండ్రులను వదిలిపెట్టి భారతదేశానికి వచ్చారు. కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్‌లో కొన్ని సంవత్సరాలు నివాసం ఉండి అనంతరం ఆదోని పట్టణానికి వచ్చారు. ఇద్రూస్‌బాషాకు ముగ్గురు భార్యలు. వీరిలో ఇద్దరు భార్యలకు సంతానం లేదు. మొదటి భార్యకు ముగ్గురు సంతానం కాగా వారిలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.
నాడు ఖుదాపల్లె..
ఆదోని నుంచి గూటుపల్లెకు వచ్చిన స్వామికి.. యాదవులు ఆవులు, గొర్రెలు మేపుతూ కనిపించారు. పెద్దరాజుస్వామి కుమార్తె ఫాతిమా ఉదయాన్నే మిస్వాక్ పుల్లను వజూ చేసిన స్థలంలో ఉంచి నాలుగు రకాలుగా నమాజు చేసిన తర్వాత పుల్ల మొక్కగా మారింది. దీంతో స్వామి ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. గ్రామానికి ఖుదాపల్లె అని నామకరణం చేశారు. కాలక్రమేణ అది గూటుపల్లెగా మారింది. స్వామివారి రెండో కుమారుడు సయ్యద్‌హుస్సేన్ షాబాషా 12వ ఏటనే ఆదోని పట్టణంలో జీవసమాధి అయ్యారు.
స్వామివారి మహిమలు ..
ఇద్రుస్ బాషా..గూటుపల్లెలో స్థిర నివాసం ఏర్పరచుకున్న తరువాత గొర్రెల కాపరుల భయం పోగొట్టేందుకు పులులను కొండ తీగలతో కట్టి తీసుకొచ్చారు. దీంతో స్వామికి పెద్దరాజు అని పేరు వచ్చింది. స్వామి రెండో కుమారుడు హుస్సేన్ షా బాష.. మొండి గోడను నడిపించారని ప్రతీతి. ప్రతి గురువారం పెద్ద పులి వచ్చి తనతోకతో దర్గాను శుభ్రం చేస్తుందని భక్తుల నమ్మకం. దర్గా ఆవరణలో దయ్యం, భూతం, పిశాచి పీడలు ఉన్న వారు..ఒక్క రోజు నిద్ర చేస్తే తొలిగిపోతాయనే విశ్వాసం ఉంది.
గూటుపల్లెను సందర్శించిన ఔరంగజేబు..
మొఘల్ సామ్రాజ్య పతనానికి కారకుడైన ఔరంగజేబు.. 1681లో గూటుపల్లె గ్రామాన్ని సందర్శించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ కాలంలోనే ఔరంగజేబు.. పెద్దరాజస్వామికి వేలాది ఎకరాలు ఇనాంగా ఇచ్చినట్లు రికార్డులు తెలుపుతున్నాయి.
దర్గా పీఠాధిపతిగా అక్బర్ బాషా ఖాద్రీ
ఎంతో చారిత్మ్రాకమైన ఇద్రూసాబాష దర్గాకు నేటికి 13 మంది పీఠాధిపతులుగా వ్యవహరించారు. గత 6 సంవత్సరాల క్రితం 12వ పీఠాధిపతి అయిన సయ్యద్ హఖాని బాషా ఆకాల మరణంతో వంశ పారంపర్యంగా పీఠాధిపతిగా అతని కుమారుడైన సయ్యద్ అక్బర్ బాష ఖాద్రీ ఆరు సంవత్సరాల వయస్సుల్లో బాధ్యతలు చేపట్టారు. విశేషమేమిటంటే గూటుపల్లె పీఠంతో పాటు భారత దేశంలోని 90 పీఠాలకు ఈ బాలుడు పీఠాధిపతిగా వ్యవహరిస్తున్నారు.
Advertisement