ఎంపీ మిథున్‌రెడ్డికి సెక్యూరిటీ తగ్గింపు
♦ 2+2 ఉన్న సెక్యూరిటీ 1+1కు తగ్గింపు
♦ అధికార పార్టీ ఎంపీ శివప్రసాద్‌కు మాత్రం కొనసాగింపు
సాక్షి, చిత్తూరు: వైఎస్సార్ సీపీపై అధికారపార్టీ కక్ష సాధింపు ధోరణి కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి సెక్యూరిటీ తగ్గించారు. ఇంతకుముందు 2+2 ఉన్న సెక్యూరిటీని 1+1కు తగ్గించారు. ఎస్సార్సీ(సెక్యూరిటీ రివైజ్డ్ కమిటీ) నుంచి చిత్తూరు జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్‌కు గురువారమే ఆదేశాలు వచ్చాయి. దీన్ని వెంటనే అమలు చేయడానికి పోలీసులు చర్యలు చేపడుతున్నారు. అదే సమయంలో అధికార పార్టీ చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌కు మాత్రం 2+2 సెక్యూరిటీని కొనసాగించాలని ఎస్సార్సీ నిర్ణయించడం విమర్శలకు దారితీస్తోంది.
అలాగే ఏ చట్ట సభలకు ప్రాతినిథ్యం వహించని టీడీపీ నేత బద్రీ నారాయణకు(చిత్తూరు ఎమ్మెల్యేకు బంధువు)కు సెక్యూరిటీని ఎలా కొనసాగిస్తారని పోలీసులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎంపీ మిథున్‌రెడ్డి స్పందిస్తూ సెక్యూరిటీ తగ్గిస్తే భయపడతానని టీడీపీ నేతలు భావిస్తున్నారనీ,కానీ తాను భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. ఇలాంటి కక్ష సాధింపు చర్యలు ప్రజలు గమనిస్తున్నారన్నారు.