విత్తనాలు ఇచ్చేది ఇంకెప్పుడో..? | seeds distribution when? | Sakshi
Sakshi News home page

విత్తనాలు ఇచ్చేది ఇంకెప్పుడో..?

Published Thu, Oct 6 2016 12:49 AM | Last Updated on Mon, Oct 1 2018 4:26 PM

seeds distribution when?

కడప అగ్రికల్చర్‌:
 జిల్లాలో రబీ సీజన్‌ ప్రారంభమైంది. ఏటా సీజన్‌ కంటే ముందే అన్ని సిద్ధం చేసి విత్తనాలను జిల్లా యంత్రాంగం పంపిణీ చేస్తూ వస్తోంది. అయితే ఈ ఏడాది రబీ సీజన్‌ మొదలైనా ఇప్పటికి సాగుకు తగ్గ ప్రణాళికలు తయారు చేయకపోవడం, విత్తనాలు ఎప్పుడిస్తారు? ఏఏ విత్తనాలు ఇస్తారు? విత్తనాలు తీసుకోవడానికి ఏమేమి సమర్పించాలి? అనే విషయాన్ని ఇంతవరకు వెల్లడించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సీజన్‌ ప్రారంభమైనా ఇంత వరకు జిల్లా యంత్రాంగం అన్ని రకాల విత్తన కేటాయింపులు చేపట్టకపోవడంపై రైతు సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. జిల్లాలోని కొన్ని మండలాల్లో ఇటీవల రోజు మార్చి రోజు కురిసిన వర్షాలకు భూములు పదునెక్కాయి. విత్తనాలు పంపిణీ చేస్తే విత్తనం వేసుకుందామని రైతులు ఎదురు చూస్తున్నారు. కొన్ని మండలాల్లో సకాలంలో అదునులో పదునైంది. విత్తనం భూమిలో పడితేనే దిగుబడులు వస్తాయనేది రైతుల నమ్మకం. కానీ జిల్లా యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
             నైరుతి రుతుపవనాలు తీవ్ర నిరాశ పరచడంతో ఖరీఫ్‌ పంటలు పూర్తి స్థాయిలో తుడిచి పెట్టుకుపోయాయి. జిల్లా వ్యాప్తంగా 66.09 వేల హెక్టార్లలో సాగు చేసిన పంటలు చేతికి రాకుండా పోవడంతో కోట్లాది రూపాయల రాబడిని నష్టపోయారు. అయితే ఈ నష్టాన్ని, కష్టాన్ని దిగమింగుతూ రబీ సీజన్‌లో పంటల సాగుకు రైతులు సిద్ధపడుతున్నారు.
కోటి ఆశలతో పంటలసాగు...
నైరుతి రుతుపవనాలు నట్టేట ముంచాయని, ఇప్పుడు వస్తున్న ఈశాన్య రుతుపవనాలపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. కనీసం ఈ శాన్యమైనా కరుణించకపోతుందా అని కోటి ఆశలతో పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ఈ రబీలో బుడ్డశనగను 89,398 హెక్టార్లలోను, వేరుశనగ 18,283 హెక్టార్లలోను, నువ్వులు 7,780 హెక్టార్లలోను, ప్రొద్దుతిరుగుడు 31,791 హెక్టార్లలోను, పెసర 3409 హెక్టార్లలోను, మినుము 2660 హెక్టార్లలోను, జొన్న 11195 హెక్టార్లలోను, మొక్కజొన్న 2377 హెక్టార్లలోను, సజ్జ 1735 హెక్టార్లలోను , వరి 9913 హెక్టార్లలోను సాగు చేస్తారని ఒక అంచనా. అయితే ఇంతవరకు ఆయా పంటలకు విత్తనాలు ఏ మండలానికి ఎంతెంత ఇస్తారో ప్రణాళిక తయారు కాకపోవడం గమనార్హం. రాష్ట్ర వ్యవసాయశాఖ బుడ్డశనగలు 65,430 క్వింటాళ్లు, వేరుశనగకాయలు 27,500 క్వింటాళ్లకు అనుమతులు ఇచ్చింది. కానీ ఇతర విత్తనాలకు అనుమతులు ఇవ్వలేదు. రైతులకు కావలసిన విత్తనాలన్నీ ఇస్తామని చెబుతున్నా ఇంతవరకు పంపిణీ ప్రస్తావన లేదు. ఈ విత్తన పంపిణీ కాగితాల్లో మూలుగుతూనే ఉంది గాని, ఉన్నతస్థాయి అధికారుల ముద్ర ఎప్పుడు పడుతుందో, విత్తనం ఎప్పుడిస్తారోననే అయోమయం రైతుల్లో నెలకొంది. ఖరీఫ్‌తో పోలిస్తే రబీలో పంటల సాగు విస్తీర్ణం బాగా పెరుగుతుంది. కానీ సకాలంలో విత్తనాలు ఇవ్వకపోతే ప్రయోజనం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా అయితే గత నెల సెప్టెంబర్‌లోనే రైతులకు బుడ్డశనగ, మినుములు,పెసలను అందించాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే ఈనెల మొదటి వారంలో విత్తనాలు పంపిణీ చేసే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. ప్రతి రోజు జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు వీడియో కాన్ఫరెన్సులు, టెలి కాన్ఫరెన్సులు, జిల్లా సమీక్ష సమావేశాలతో కాలం వెల్లదీస్తున్నారని ఆ శాఖ అధికారులే పెదవి విరుస్తున్నారు. గ్రామాల్లోని రైతులు విత్తనాలు ఎప్పుడిస్తారని ప్రతి రోజు ఫోన్‌లు చేసి మరీ అడుగుతుంటే చెప్పలేకపోతున్నామని ఓ మండల వ్యవసాయాధికారి సాక్షికి తెలిపారు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఏఏ పంటలు సాగు చేసుకుంటే బాగుంటుందని అడుగుదామనుకుంటే సమాచారం చెప్పే నాథుడే లేడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురవడంతో నల్లరేగడి, తువ్వ నేలలు పదునెక్కాయి. ఈ పదును పోకముందే కాసిన్ని విత్తనాలు ఇస్తే.. సాగు చేసుకుంటే దిగుబడులు వస్తాయని, అదును, పదును పోయాక విత్తనాలు ఇచ్చినా ఉపయోగం ఉండదని రైతులు అంటున్నారు. మండలాల వారీగా కేటాయింపులు,ఏఏ మండలాల్లో ఎప్పుడెప్పుడు పంపిణీ చేసేది వెంటనే ప్రకటించాలని రైతులు జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నారు.
 ు  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement