- సప్తగిరి రైస్‌మిల్లు మేనేజర్‌పై కేసు నమోదు
సీజ్డ్ ధాన్యం, బియ్యం గల్లంతు
Published Mon, Nov 7 2016 1:06 AM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM
నాయుడుపేటటౌన్ : జిల్లా సివిల్ సప్లయీస్ అధికారులు సీజ్ చేసిన సుమారు రూ.46 లక్షల విలువైన ధాన్యం, బియ్యంను నాయుడుపేట సప్తగిరి రైస్‌మిల్లు వద్ద భద్రపరచగా అవి గల్లంతైనట్లు ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు అందింది. సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ పీవీ కొండయ్య సమాచారం మేరకు.. జిల్లా సివిల్ సప్లయీస్ అధికారులు తుమ్మూరు సమీపంలో ఉన్న శ్రీదేవి రైస్‌మిల్లుకు సీఎమ్మార్ ధాన్యంను అప్పగించగా వాటిని ప్రభుత్వానికి తిరిగి చెల్లించకుండా మోసం చేయడంతో గత సెప్టెంబర్ నెల 30వ తేదీన రైస్‌మిల్లు తనిఖీలు చేపట్టి రూ.1.32 కోట్లు మోసం చేసినట్లు మిల్లు యజమాని బొల్లినేని కుమారస్వామినాయుడుపై కేసు నమోదు చేశామన్నారు. అదే రోజు రైస్‌మిల్లులో 343.50 క్వింటాళ్ల బీపీటీ ధాన్యం, 966.50 క్వింటాళ్ల గ్రేడ్ ఏ బియ్యంను సీజ్ చేసి నాయుడుపేట సప్తగిరి రైసుమిల్లుకు భద్రపరిచేందుకు అప్పగించామన్నారు. అయితే ప్రభుత్వం భద్రపరిచిన ధాన్యం, బియ్యంను తనిఖీ చేసేందుకు వెళ్లగా అక్కడ లేకుండా అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాటిని విక్రయించేసి ఉండడాన్ని అధికారులు గుర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ధాన్యం, బియ్యం గల్లంతుపై మిల్లు మేనేజర్ పీ వీరరాఘవరెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Advertisement