ఫైలు కదలాలంటే చేయి తడపాల్సిందే
ఫైలు కదలాలంటే చేయి తడపాల్సిందే
Published Tue, May 16 2017 11:08 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
రూ.3లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్
లంచంతో పాటు అదనంగా 10 శాతం కమీషన్
రాజమహేంద్రవరం క్రైం : పోలవరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించేందుకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. భూములు , ఇళ్లు కోల్పోయి బాధలో ఉన్న రైతుల నుంచి రెవెన్యూ అధికారులు అందిన కాడికి దోచుకుంటున్నారు. అమాయక గిరిజనులు చేసేది లేక బాధను దిగమింగుకొని లంచాలు ఇస్తున్నారు. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో స్పెషల్ డిఫ్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న డి.పుష్పమణి బ్రోకర్ల ద్వారా భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు లంచం డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె పై దృష్టి సారించిన ఏసీబీ అధికారులు మంగళవారం జీలుగు మిల్లి మండలం జిల్లెల గూడెం గ్రామానికి చెందిన గుజ్జు వీరమ్మకు చెందిన 8.18 ఎకరాలకు, రెండున్నర ఎకరాలకు భూమికి భూమి ఇస్తు, మిగిలిన 5.18 ఏకరాల భూమికి నష్టపరిహారం చెల్లించేందుకు రూ.11 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఈ లంచాన్ని మంగళవారం బ్రోకర్ ద్వారా డి.పుష్పమణి వద్ద డిఫ్యూటేషన్‌పై చేసిన ఒక అధికారి ప్రస్తుతం రాజమహేంద్రవరం పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మణికొండ వెంకటరమణప్రసాద్ ద్వారా రూ 3 లక్షలు తీసుకుంటుండగా ఏలూరు రేంజ్ ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ, రాజమహేంద్రవరం రేంజ్ డీఎస్పీ ఎం.సుధాకర్, ఇన్‌స్పెక్టర్ విల్సన్, ఎస్సై నరేష్‌లు ఆకస్మిక దాడులు చేసి రెడ్ హేండెడ్‌గా పట్టుకున్నారు.
లంచం తీసుకున్న అనంతరం ఫోన్‌లో సంభాషణ
మంగళవారం మధ్యహానం లంచం తీసుకున్న మణికొండ వెంకట రమణ ప్రసాద్ రూ 3 లక్షలు లంచం తీసుకొని తన పై అధికారి అయిన డిఫ్యూటీ కలెక్టర్ గి. పుష్పమణికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఏసీబీ అధికారులు రమణ ప్రసాద్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఎంత మందికి సంబంధాలు ఉన్నాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సమగ్రమంగా దర్యాప్తు చేసి దోషుల పై కేసులు నమోదు చేస్తాని ఏలూరు రేంజ్ డీఎస్పీ వి.గోపాలకృష్ణ తెలిపారు.
లంచంతో పాటు పరిహారంలో 10 శాతం కమీషన్
పోలవరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. నష్టపరిహారం మంజూరు అయి మూడేళ్లు కావస్తున్నా గిరిజన రైతులను కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిప్పుకుంటూ లంచాలు గుంజుతున్నారు. ట్రైబుల్ వెల్ఫేర్ డిఫ్యూటీ కలెక్టర్‌గా కేఆర్ పురంలో పనిచేస్తున్న డి.పుష్పమణి, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ1కు ఇన్‌చార్జి కలెక్టర్ గాను, తాడిపూడి ఎత్తిపోతల పథకం (నల్లజర్ల)ఇన్‌చార్జ్‌గాను వ్యవహరిస్తున్నారు. 16 నెలలుగా విధులు నిర్వహిస్తున్న డి.పుష్పమణి, బ్రోకర్లు ద్వారా లంచాల దందా నిర్వస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుకూరి పేట, లోతుపాలెం శరభవరం, తదితర ప్రాంతాలలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు ముందుగా లంచం ఎంత ఇవ్వాలి అనేది బేరం కుదుర్చుకుంటారు. ఇన్‌స్టాల్ మెంట్‌లో లంచం చెల్లించే వారి పేరున చెక్కులు ఇస్తుంటారు. నష్టపరిహారం చెల్లించకుండానే రైతుల నుంచి ఖాళీ చెక్కులు తీసుకున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవీపట్నం మండలంలో ఎకరానికి రూ 7.50 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తున్నారు. నష్టపరిహారం అందాలంటే ముందుగా లంచం సొమ్ము ముట్టాల్సిందే. అనంతరం నష్టపరిహారంలో భూములకు 10 శాతం, ఇళ్ళకు 5 శాతం చొప్పున సొమ్ము గుంజుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ అవినీతి పరులపై లోతుగా దర్యాప్తు చేసి గిరిజనుల సొమ్మును దోచుకుంటున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Advertisement