
పలకరిస్తే చాలు.. అదే పదివేలు
జీవన సాగరంలో ఎన్నో సుడిగుండాలను దాటివచ్చారు.
పండుటాకుల పండగ
జీవన సాగరంలో ఎన్నో సుడిగుండాలను దాటివచ్చారు... మలిసంధ్యలో అడుగు పెట్టారు.. వారికి సిరి సంపదలు అక్కర్లేదు.. రాజభోగాలు అవసరం లేదు.. పలకరిస్తే చాలు పులకరించిపోతారు.. ఆత్మీయులను చూడగానే పసిపిల్లలై పోతారు. నిండైన
ఆప్యాయతను స్వచ్ఛమైన ప్రేమను పంచుతారు. అలాంటి వృద్ధులందరికీ నేడు పండుగ రోజు సందర్భంగా ప్రత్యేక కథనం.
అనంతపురం కల్చరల్: కొమ్మకు పూసిన పూలు వాడక తప్పవు. చెట్టుకు కాసిన కాయలు రాలకా మానవు. అలాగే పుట్టిన ప్రతి మనిషికి వృద్ధాప్యం రాక మానదు. ఇదంతా సృష్టి వైచిత్రి. జననం, బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, మరణం.. ఇదే జీవిత క్రమం. జీవన సత్యం. వృద్ధాప్యం మరో పసితనం లాంటిది. చిన్న పలకరింపులు కోరుకునే వయసు, ఆత్మీయుల కోసం ఎదురు చూసే మనసు వారి సొంతం. 60 ఏళ్లు దాటిన వారిని సీనియర్ సిటిజన్లుగా వ్యవహరిస్తున్నారు. వారికంటూ చరిత్రలో ఓ రోజును కేటాయించారు. ఆగస్టు 21న ‘సీనియర్ సిటిజన్ల దినోత్సవం’గా జరుపుకుంటున్నారు. మలిసంధ్యకు చేరుకున్న ఈ సీనియర్ సిటిజన్లు భయపడుతూ రాలిపోకుండా.. శేష జీవితాన్ని ఆనందంగా గడపాలన్నది ఈ దినోత్సవం అందించే సందేశం.
అందుకనుగుణంగానే ఆరు సంవత్సరాల కిందట నగరంలో జిల్లా సీనియర్ సిటీజన్ కార్యాలయం ఏర్పాటైంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటి గురించి పోరాడుతున్నారు. దాదాపు ఇందులో 700 మందికి పైగా సభ్యులున్నారు. వీరిలో చాలా మంది క్రమం తప్పకుండా కలుస్తూ సాధక బాధకాలు పంచుకుంటున్నారు. వృద్ధాప్యంలో వచ్చే ఆత్మనూన్యతా భావం విడనాడాలని సూచిస్తున్నారు. ఎక్కువ మంది హాయిగా సంతోషంగా గడుపుతున్నారు. ఈనెల 23న జిల్లా సీనియర్ సిటిజన్ల గెట్ టు గెదర్ నిర్విహించనున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక ఓవర్ బ్రిడ్జి సమీపంలోని జిల్లా కార్యాలయంలో ఉదయం 10 గంటలకు జరిగే సమావేశానికి అందరూ తప్పక హాజరై సీనియర్ సిటీజన్ల సమస్యలపై చర్చించాలని కోరారు.
భయం వీడాలి
చాలా మంది వృద్ధాప్యం వస్తోందంటే ఎక్కువగా భయపడుతుంటారు. బతికనన్ని రోజులు ఆనందంగా ఉల్లాసంగా గడిపితే ఎలాంటి అనారోగ్యం దరి చేరదు. అలా ఉండాలనే మేమంతా ప్రతిరోజు కలుస్తూ ఎలాంటి కష్టసుఖాన్నైనా పంచుకుంటాము. పిల్లలు కూడా బాధ్యతలను గుర్తెరిగి వారిని పలకరిస్తుంటే చాలు.
- నంబియార్, తపోవనం
ప్రభుత్వాలు ఆదుకోవాలి
ప్రభుత్వ ఉద్యోగులకిచ్చే హెల్త్ అసిస్టెన్స్ వృద్ధులకు కూడా ఇవ్వాలి. బస్సు చార్జీల్లో రాయితీ ఇవ్వాలి. అనంత జనాభాలో పాతిక శాతం సీనియర్ సిటీజన్లున్నారు. వారికి మేమే స్వయంగా వృద్ధాశ్రమాన్ని కట్టించాలని ప్రయత్నిస్తున్నాము. సీనియర్ సిటిజన్లు సాహిత్యంలోనే, కళా రంగంలోనో ఉంటే ఎంతో ఉత్సాహంగా ఉంటారు.
- ముడార్ వేణుగోపాల్, సభ్యుడు, సీనియర్ సిటిజన్ అసోసియేషన్
యంగ్‌గా ఉండాలనుకుంటా
వయసు మీద పడుతున్న భావనను దగ్గరికి రానీయకపోతే చాలా మటుకు వృద్ధాప్యపు బాధలు తొలగిపోతాయి. నా వరకు నేను నిత్యం యంగ్‌గా ఉండాలని కోరుకుంటాను. నాకిప్పుడు 68 ఏళ్లంటే చాలా మంది నమ్మరు. మేమంతా ఎన్జీవో హోమ్ వద్ద కలిసి కష్టాసుఖాలు పంచుకుని ఆటపాటలతో ఉల్లాసంగా గడుపుతుంటాం.
- ఎంఏ అలీమ్, విశ్రాంత ఇంజనీరు.