ప్రకంపనలు
ప్రకంపనలు
Published Wed, Nov 9 2016 12:00 AM | Last Updated on Sat, Sep 22 2018 7:50 PM
రూ.500, రూ.1000 నోట్ల నిషేధంపై షాక్
– విస్మయం వ్యక్తం చేస్తున్న వ్యాపార, పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు
– కొంత సమయం ఇచ్చి నిషేధం విధించి ఉంటే బాగుండేదని మరికొందరి అభిప్రాయం
– స్వాగతిస్తున్న బ్యాంకు వర్గాలు
– ఏటీఎంల వద్ద పోటెత్తిన క్యూలు
కర్నూలు(అగ్రికల్చర్): రూ.500, రూ.1000 నోట్లను నిషేధిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం ప్రకంపనలు సృష్టిస్తోంది. వ్యాపార, పారిశ్రామికవేత్తలకు ఇది షాక్ కలిగిస్తోంది. ఉన్నట్టుండి ఎవరూ ఊహించని విధంగా నోట్ల నిషేధం తక్షణం అమల్లోకి తీసుకురావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బ్లాక్ మనీ, నకిలీ కరెన్సీని అరికట్టేందుకు ఈ నిర్ణయం మంచిదే అయినా ఎలాంటి సమయం ఇవ్వకుండా ఏకంగా నిషేధం విధించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. నేడు చిన్న కుటుంబం మొదలుకొని, సంపన్నుల వరకు రూ.500, రూ.1000 నోట్లు ఉంటున్నాయి. వీటిని నేటినుంచి మార్చుకోవాలంటే విధిగా ఐడీ కార్డు చూపాల్సి ఉంటుంది. బ్యాంకింగ్ వర్గాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా వ్యాపార, పారిశ్రామికవేత్తలు మాత్రం షాక్‌కు గురవుతున్నారు. ఇక నుంచి బ్యాంకులు, పోస్టాఫీసులకు ఈ కరెన్సీ పోటెత్తే అవకాశం ఏర్పడింది. ఏకంగా రెండు రోజుల పాటు ఏటీఎం సేవలను నిలిపివేయడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. ఏటీఎంలు అందుబాటులోకి రావడంతో అత్యవసర పనులకు సైతం వీటినే ఉపయోగిస్తున్నారు. రెండు రోజులు వీటిని బంద్ చేస్తుండటం వల్ల వివిధ వర్గాల ప్రజలు సమస్యలు ఎదుర్కోనున్నారు. ఏటీఎంలు బంద్ కావడం వల్ల మెడికల్ వంటి అత్యవసర పనులకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా ఏటీఎంలపై మంగళవారం రాత్రే ఒత్తిడి పెరిగింది. ఏటీఎం కేంద్రాలకు ఖాతాదారులు క్యూ కట్టారు. పెద్దనోట్లను బ్యాన్ చేయడానికి ముందు మార్పిడికి కొంత వ్యవధి ఇచ్చి తర్వాత నిషేధం అమలులోకి తీసుకువచ్చి ఉంటే బాగుండేదని వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కొత్త టెక్నాలజీతో రానున్న రోజుల్లో రూ.500, రూ.2000 నోట్లను అమల్లోకి తీసుకురావడానికి ప్రధానమంత్రి చర్యలు తీసుకున్నా, ఉన్న నోట్లను నిషేధిస్తూ తక్షణం అమలులోకి తీసుకురావడం అనేకమందికి మింగుడుపడని విషయంగా మారింది. ప్రధాని నిర్ణయం ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇంతవరకు పెద్ద నోట్లు చెలామణిలో ఉండటంతో బ్యాంకుల్లో రూ.100 నోట్ల సర్కులేషన్ తక్కువగా ఉంది. డిసెంబర్ చివరిలోగా వీటిని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఐడీ కార్డులు చూపించి మార్పిడి చేసుకోవాల్సి ఉండటంతో రూ.100 నోట్ల అవసరం పెరిగింది. ఇందుకు అనుగుణంగా రిజర్వు బ్యాంకు వీటిని పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఏటీఎంలలో డిపాజిట్లు మొదలు
ప్రధానమంత్రి నిర్ణయం వెలువడిన వెంటనే ఏటీఎంలలో పెద్ద నోట్లను డిపాజిట్లు చేయడం మొదలయ్యింది. మంగళవారం రాత్రే జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది బ్యాంకు ఖాతాదారులు ఏటీఎంలలో రూ.1000, రూ.500 నోట్లను జమ చేసినట్లు సమాచారం. మరోవైపు ఏటీఎంలలో నుంచి విత్‌డ్రాయల్ కూడా భారీగా పెరిగింది. ఒకవైపు డిపాజిట్లు మరోవైపు విత్‌డ్రాయల్‌లతో ఏటీఎం సెంటర్లు కిటకిటలాడాయి.
నకిలీ, బ్లాక్ మనీ అరికట్టేందుకు ప్రధాని నిర్ణయం తోడ్పడుతుంది... : గోపాలకృష్ణ, డీజీఎం, ఆంధ్రా బ్యాంకు
రూ.500, రూ.1000 నోట్లను నిషేధిస్తూ ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం మంచిదే. దీనివల్ల నకిలీ కరెన్సీ, బ్లాక్ మనీని పూర్తిగా నిరోధించవచ్చు. బ్లాక్ మనీ మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే బ్యాంకులపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ వీటిని మార్పిడి చేసుకోవాల్సి ఉండటం వల్ల బ్యాంకులకు పనిభారం పెరుగుతుంది. మొత్తంగా ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.
ఇది షాకింగ్ న్యూస్... : చంద్రశేఖర్, చైతన్య కెమికల్స్ అధినేత
ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ ఇంత అకస్మాత్తుగా పెద్ద నోట్లను నిషేధించడం అన్ని వర్గాలను షాక్‌కు గురిచేసింది. కొంత వ్యవధి ఇచ్చి నిషేధాన్ని అమలులోకి తీసుకువచ్చింటే బాగుండేది. సామాన్యుల నుంచి అన్ని వర్గాల వారికి ఇది ఉత్కంఠను, ఆందోళనను కల్గిస్తోంది. అయినప్పటికీ దీనివల్ల నకిలీ కరెన్సీ, బ్లాక్ మనీని పూర్తిగా నివారించవచ్చు.
ప్రతి లావాదేవీలు చెక్కుల ద్వారానే జరగాలి
- మణికంఠ, ప్రొప్రైటర్, తులసయ్య జ్యువెలర్స్
పెద్ద నోట్లను బ్యాన్ చేస్తూ ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం హర్షణీయమే. దీంతో పాటు బ్లాక్ మనీని, నకిలీ కరెన్సీని అరికట్టేందుకు నేరుగా నగదు చెల్లింపులు నిషేధించాలి. ప్రతి లావాదేవీలపై చెక్కులను అమలులోకి తీసుకువస్తే బ్లాక్ మనీని సులభంగా నివారించవచ్చు. బ్యాంకు లావాదేవీల వల్ల నకిలీ కరెన్సీకి కూడా తావు ఉండదు.
Advertisement
Advertisement