సర్వర్ డౌన్..విత్తన పంపిణీకి బ్రేక్
అనంతపురం అగ్రికల్చర్: సర్వర్ డౌన్ కావడంతో ప్రత్యామ్నాయ సాగు విత్తన పంపిణీకి బ్రేక్ పడింది. చాలా చోట్ల బయోమెట్రిక్ మొరాయించడంతో అటు రైతులు, అటు అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొనడంతో చాలా చోట్ల రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. తొలిరెండు రోజుల్లో ఓ మోస్తరు విత్తన పంపిణీ చేసినా... మూడో రోజు పంపిణీ దాదాపుగా నిలిచిపోయింది. అనంతపురం, గార్లదిన్నె, ఆత్మకూరు, రొద్దం తదితర మండలాల్లో ఉదయం 8 గంటలకే కౌంటర్ల వద్ద రైతులు బారుతీరి కనిపించారు.
ఎండలు కూడా ఎక్కువగా ఉండటంతో వరుసల్లో నిలబడేందుకు ఇబ్బంది పడ్డారు. దీనికి తోడు బయోమెట్రిక్ పనిచేయకపోవడంతో రైతులు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. సర్వర్ సమస్య గురించి జిల్లా కేంద్రంలో ఉన్న సీడ్‌సెల్, ఎన్‌ఐసీ సెంటర్లకు తెలిపినా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో బుధవారం ‘ప్రత్యామ్నాయ’ విత్తనాల కోసం వచ్చిన వందలాది మంది రైతులు నిరాశతో వెనుదిరిగారు.