అమెరికాలో తెనాలి సాఫ్ట్‌వేర్ యువకుడి మేథస్సు
వెబ్ ఆపరేటింగ్ సిస్టం టీవీకి రూపకల్పన
ఎలక్ట్రానిక్ రంగంలో దూసుకుపోతున్న వినూత్న ఉత్పత్తి
తెనాలి: వెబ్ ఆపరేటింగ్ సిస్టమ్ టీవీ...ప్రస్తుతం బుల్లితెర ప్రపంచంలో సరికొత్త సంచలనం. దీని ధర లక్షల్లో ఉన్నా మార్కెట్‌లో అద్భుతమైన క్రేజ్ దక్కించుకుంది.ఎలక్ట్రానిక్ విపణిలో ప్రస్తుతం ఇదే ఆకర్షణీయమైన పరికరకంగా నీరాజనాలు అందుకుంటుది. అయితే దీని రూపకల్పన వెనుక ప్రవాస భారతీయుడైన తెనాలి యువకుడైన శైలేష్ మేధస్సు ఉండడం విశేషం.ప్రస్తుతం ఈయన ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రఖ్యాతి చెందిన అంతర్జాతీయ ఎల్‌జి కంపెనీలో డెరైక్టర్ హోదాలో పనిచేస్తున్నారు.
ఈయన అక్కడ పనిచేస్తూనే ఇటీవల వెబ్ ఓఎస్ టీవీ రూపకల్పనలో హ్యాండ్స్-ఆన్-లీడర్‌గా పనిచేశారు.ఇప్పుడు ఇది ఎలక్ట్రానిక్ రంగంలో సంచలనాలు సృష్టిస్తోంది. తొలిసారిగా 2014 జనవరిలో లాస్ వెగాస్‌లో జరిగిన ఎలక్ట్రానిక్ షోలో శైలేష్ దీన్ని ప్రదర్శించారు.ఆ తర్వాత శాన్‌ఫ్రాన్సిస్కోలోనూ ప్రదర్శించారు. దీనికి మంచి పేరు రావడం, ముఖ్యంగా అమెరికాతో సహా పలు దేశాల్లో దీన్ని విడుదల చేశారు. ఇప్పుడిది తాజాగా ఇండియన్ మార్కెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
నూతన ఆవిష్కరణలే ప్రత్యేకతగా...
శైలేష్ స్వస్థలం తెనాలి. తలిదండ్రులు రాచాబత్తుని విద్యుల్లత, శ్రీనివాసరావు. ఏలూరులో బీటెక్ పూర్తిచేశాక ఏడాదిపాటు హైదరాబాద్‌లో ఉద్యోగం చేశారు. అనంతరం 1997లో అమెరికా వెళ్లారు. ఎక్కడ పనిచేసినా తనకంటూ భిన్నమైన ఉత్పత్తులు డిజైన్ చేయడాన్ని అలవాటుగా మార్చుకున్న శైలేష్ 2000 సంవత్సరంలో మోటరోలా ఆన్‌కార్పొరేటెడ్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేసిన కాలంలో ‘పియానో’ అనే నూతన ప్రొటోకాల్ డిజైన్‌లో కీలకపాత్ర వహించారు.
పియానో ఆధారిత వాణిజ్య ప్రొటోటైపును తొలిగా రూపొందించిన జట్టుకు ఈయన నాయకత్వం వహించారు. తర్వాత ఫిలిప్స్ కన్య్జూమర్స్ కమ్యూనికేషన్ సంస్థలో బ్లూటూత్ టెక్నాలజీ సిస్టమ్స్ ఆర్కిటెక్ట్‌గా చేరారు. బ్లూ టూత్, వైర్‌లెస్ ప్యాకెట్ నెట్‌వర్క్ ఆధారంగా పరిశోధనాత్మకమైన లోకేషన్ బేస్డ్ సర్వీసెస్‌కు ఆర్కిటెక్టర్‌ను రూపొందించారు. సంస్థకు రెండు పేటెంట్లను నమోదుచేశారు.2003లో పామ్ వన్ ఇన్ కంపెనీకి మారారు. 2005-06లో మొదటి స్మార్ట్‌ఫోన్ చేసిన ఖ్యాతి ఆ కంపెనీది.
ఆ ఘనతలో సీనియర్ ఇంజినీరుగా శైలేష్ పాత్ర ఉంది. 2007 తర్వాత అమెజాన్‌కు వెళ్లారు. ఇక్కడ ఎలక్ట్రానిక్ పుస్తకాల‘కిండిల్’ (2008) ఉత్పత్తిలో శైలేష్ తనదైన ముద్రవేశారు. అక్కడ్నుంచి ఎల్‌జి కంపెనీలో డెరైక్టర్ హోదాకు వెళ్లినా, పర్యవేక్షణతోనే సరిపెట్టకుండా పనిచేయటం శైలేష్‌కు ఇష్టం. దాంట్లో భాగంగానే హ్యాండ్స్-ఆన్-టెక్నికల్ లీడర్‌గా వెబ్ ఓఎస్ టీవీ తయారీలో కీలకపాత్ర వహించారు.
స్మార్ట్‌ఫోను తరహాలో ఎన్నో ప్రత్యేకతలు...
వెబ్ ఓఎస్ టీవీని పెద్ద స్మార్ట్ ఫోనుగా చెప్పవచ్చు. నెట్‌లిక్స్‌లో సినిమా చూస్తూ హోల్డ్‌లో పెట్టి, ఇంకో వీడియో చూసుకోవచ్చు. లైవ్ టీవీ వీక్షించవచ్చు. ఆండ్రాయిడ్ ఫోను తరహాలో అన్ని యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకొనే వెసులుబాటు మరో ప్రత్యేకత. వెబ్ ఓఎస్ ఫోన్లు, టాబ్లెట్లను చేసే సాఫ్ట్‌వేర్‌తోనే టీవీ తయారుచేసినట్టు శైలేష్ వివరించారు. ప్రస్తుతం విజయవాడ,గుంటూరు,తెనాలిలోనూ ఇది అందుబాటులోకి వచ్చింది. దీని ధర స్క్రీన్ సైజు ప్రకారం రూ.2.50 లక్షల పైగా పలుకుతోంది.