![డోంట్ వర్రీ.. నేనున్నాగా..!](/styles/webp/s3/article_images/2017/09/3/61441175742_625x300.jpg.webp?itok=iL10R710)
డోంట్ వర్రీ.. నేనున్నాగా..!
విజయవాడ : భూ వివాదంలో కూరుకుపోయిన పోలీసు అధికారిని రక్షించేందుకు నియోజకవర్గం ప్రజలు ముద్దుగా షాడో ఎమ్మెల్యేగా పిలుచుకునే వ్యక్తి రంగంలోకి దిగినట్టు తెలిసింది. తనను గండం నుంచి గట్టెక్కించాలంటూ వచ్చిన మధ్యవర్తులతో ‘ప్యాకేజీ’ కుదుర్చుకొని ఇబ్బందుల నుంచి బయటపడేస్తానంటూ భరోసా ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. గుంటూరుకు చెందిన ఓ వైద్యుని ప్లాట్ల విషయంలో చోటు చేసుకున్న మోసం, పోలీసు కమిషనర్ ఆదేశంలో కేసు నమోదు, నిందితులను అదుపులోకి తీసుకోవడం తదితర పరిణామాలపై ‘సెటిల్‌మెంట్..సో బెటర్ బాస్!’ శీర్షికన మంగళవారం సాక్షి పత్రికలో వచ్చిన కథనం పెనమలూరు నియోజకవర్గంలో కలకలం రేపింది.
స్టేషన్‌కి వచ్చిన బాధితుణ్ణి ప్రైవేటు వ్యక్తుల వద్ద సెటిల్ చేసుకోమంటూ సాక్షాత్తు పెనమలూరు ఇన్‌స్పెక్టర్ జగన్మోహనరావు పంపడంపై నియోజకవర్గం ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.కాగా, విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారడం, పోలీసు కమిషనర్ విచారణకు ఆదేశించడంతో పెనమలూరు పోలీసు స్టేషన్ అధికారి మధ్యవర్తుల ద్వారా షాడో ఎమ్మెల్యేని ఆశ్రయించినట్టు తెలిసింది.
గతంలో వారికి తాను చేసిన ఉపకారం ఏకరువు పెట్టడంతో పాటు తనను బయటపడేస్తే రానున్న రోజుల్లో చేయబోయే సాయం గురించి కూడా భరోసా ఇచ్చినట్టు తెలిసింది. లిక్కర్ సిండికేట్ వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఉండటం కూడా పోలీసు అధికారికి కలిసొచ్చింది. షాడో ఎమ్మెల్యేగా చెప్పుకునే వ్యక్తి లిక్కర్ సిండికేట్‌లో కీలక వ్యక్తి కావడంతో సాయం చేసే వ్యక్తిని వదులుకోవద్దంటూ పలువురు చెప్పినట్టు వినికిడి. పైగా సాయం చేసినందుకు ప్యాకేజీ ఆఫర్ కూడా ఇవ్వడంతో ఆయన రంగంలోకి దిగి నియోకవర్గంలోని కీలక ప్రజాప్రతినిధి ద్వారా పోలీసు పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు పోలీసు వర్గాల సమాచారం.
ఇద్దరి పైనే కేసు
పోలీసు కమిషనర్ సవాంగ్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేయడంతో పాటు అదుపులోకి తీసుకున్న ముగ్గురిలో ఇద్దరిపైనే కేసు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆఖర్లో రంగ ప్రవేశం చేసిన వ్యక్తి పై స్థాయిలో తన పలుకుబడి ఉపయోగించి బయటపడేందుకు చేసిన యత్నాలు ఫలించినట్లు చెపుతున్నారు. పైగా విచారణ అధికారి ఆ వ్యక్తి మంచోడంటూ ముందుగానే కితాబు ఇచ్చిన విషయం తెలిసిందే. ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టించేందుకు ఇక్కడి అధికారులు చేస్తున్న ప్రయత్నాలపై పలువురు మండిపడుతున్నారు.
ఏసీపీ ఆగ్రహం
ఓ కేసు దర్యాప్తు కోసం పెనమలూరు పోలీసుస్టేషన్‌కి వెళ్లిన మహిళా పోలీసు స్టేషన్ ఏసీపీ టిఎస్‌ఆర్‌కె ప్రసాద్ అక్కడి పోలీసు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయన వెళ్లేసరికే అదుపులోకి తీసుకున్న వారిని బయట కూర్చొబెట్టి మహిళా కానిస్టేబుల్ ద్వారా టీ సర్వ్ చేయిస్తున్నారు. ఇదే విషయమై అక్కడి అధికారిని మందలించడంతో పాటు వెంటనే వారిని లోపల కూర్చోబెట్టాలంటూ ఆదేశించినట్లు స్టేషన్ సిబ్బంది చెపుతున్నారు.