వణుకు
వణుకు
Published Tue, Dec 27 2016 10:37 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 PM
జిల్లాలో పెరిగిన చలి తీవ్రత
– గత ఏడాది కంటే మూడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
– ఆస్తమా, గుండె జబ్బులుంటే జాగ్రత్తలు తప్పనిసరి
సాయంత్రం ఆరు దాటితే చాలు.. చలిగాలి వణికిస్తోంది. రాత్రి 8 గంటలు దాటితే ఇంటికి ఎప్పుడెప్పుడు చేరుకుందామా అనుకుంటున్నారు. రాత్రి 10 గంటలు దాటితే కాలు బయట పెట్టేందుకూ జంకాల్సిందే. ఇక ఉదయం 7 గంటలు దాటినా దుప్పటి తీయాలనిపించదు. ఇదీ ప్రస్తుతం కర్నూలు నగరంలోని వాతావరణ పరిస్థితి.
కర్నూలు(హాస్పిటల్):
జిల్లాలో నెలరోజులుగా చలితీవ్రత పెరిగింది. మధ్యలో తుపాను ప్రభావం కారణంగా నాలుగు రోజులు విరామం లభించినా మళ్లీ చలి తన పంజా విసురుతోంది. ప్రధానంగా అటవీ ప్రాంతమైన శ్రీశైలం, సున్నిపెంట, ఆత్మకూరు, కొత్తపల్లి, పాములపాడు, మహానంది, యాగంటి, ఆళ్లగడ్డ, రుద్రవరం, శిరువెళ్ల, బనగానపల్లి, నంద్యాల తదితర ప్రాంతాల్లో చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. కర్నూలు నగరంతో పాటు డోన్, పాణ్యం, కల్లూరు, వెల్దుర్తి తదితర మండలాల్లో చలి మధ్యస్తంగా ఉంది. ఆదోని డివిజన్‌లో కర్నూలు, నంద్యాల డివిజన్‌ల కంటే కనిష్ట ఉష్ణోగ్రతల ప్రభావం పెద్దగా కనిపించలేదు. మొత్తంగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ యేడాది కర్నూలు జిల్లాలో ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గాయి.
ఆసుపత్రుల చుట్టూ పరుగులు
చలి తీవ్రత పెరగడంతో ఆస్తమా, సీఓపీడీ వంటి ఊపిరితిత్తుల వ్యాధులున్న వారు, గుండె సమస్యలున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరు సాయంత్రం 6 గంటలకే ఇంటికి చేరుకుంటున్నారు. మరునాడు ఉదయం 9 గంటల తర్వాత కూడా బయటపడే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు జలుబు, దగ్గు, జ్వరంతో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యుల వద్దకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా పసిపిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దీంతో ఉన్ని దుస్తుల అమ్మకాలు మళ్లీ ఊపందుకున్నాయి. ప్రధానంగా ఉన్ని దుస్తులను నగరంలోని అవుట్ డోర్ స్టేడియం వద్ద టిబెటియన్లు ఏర్పాటు చేసిన సెంటర్లలో కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
ఆస్తమా రోగులు చలికాలంలో జాగ్రత్త
చల్ల గాలిలో వాకింగ్‌కు వెళ్లకూడదు. గుండెజబ్బులు, ఆస్తమా, అలర్జీ ఉన్న వారు చలికాలంలో జాగ్రత్తలు పాటించాలి. ఆస్తమా ఉన్న వారు కొండ ప్రాంతాలు, చల్లగాలులు అధికంగా ఉండే ప్రాంతాలకు విహార యాత్రలకు వెళ్లరాదు. పిల్లలను సైతం చలిగాలి తగలకుండా ఉన్ని దుస్తులు కప్పి ఉంచాలి.
– డాక్టర్ నెమలి రవికుమార్‌రెడ్డి, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు
రెండేళ్లుగా నవంబర్‌లో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు
తేదీ 2015 2016
20 21.2 16.6
21 22.4 16.9
22 20.8 15.2
23 21.5 15.4
24 20.6 14.5
25 20 16
26 18.2 17
27 18 17.1
Advertisement
Advertisement