ఓటమి గెలుపునకు తొలిమెట్టు
రేపల్లె (గుంటూరు): ప్రతి రంగంలోనూ గెలుపోటములు సహజమని, ఓటమి గెలుపునకు తొలిమెట్టు అని మున్సిపల్ చైర్మన్ తాడివాక శ్రీనివాసరావు చెప్పారు. పట్టణంలోని శ్రీ గుత్తికొండ లక్ష్మీనారాయణ కల్యాణ మండపంలో రియో ఒలంపిక్స్–2016లో షటిల్ క్రీడలో క్వార్టర్‌ఫైనల్స్ వరకు ఆడిన షటిల్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌కు గురువారం నిర్వహించిన సన్మానసభలో ఆయన మాట్లాడారు. ఓటమికి నిరుత్సాహకపడక మరిన్ని ప్రయత్నాలు సాధిస్తే తప్పక విజయం సాధిస్తారని చెప్పారు. రియో ఒలింపిక్స్‌లో ప్రపంచ షటిల్ నంబర్ 1 క్రీడాకారుడు లిన్‌డాన్‌తో శ్రీకాంత్ చివరి వరకు పోరాడి అద్వితీయమైన ప్రతిభను కనపరించాడన్నారు. వచ్చే ఒలంపిక్స్ క్రీడల్లో తప్పకుండా శ్రీకాంత్ భారతదేశానికి బంగారు పతకాన్ని తీసుకురావాలని కోరారు. అనంతరం కిడాంబి శ్రీకాంత్‌ను, అతని తండ్రి కష్ణను పూలమాలలు, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ తూనుగుంట్ల కాశీవిశ్వనాథగుప్త, ఎంసీఏ ఉపాధ్యక్షుడు డాక్టర్ వేజళ్ళ ప్రకాశరావు, వేములపల్లి లక్ష్మీనారాయణ, గుమ్మడి రాజశేఖర్, జి.హనుమంతరావు, బాపారావు, రాధాకృష్ణమూర్తి,కె.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.