సకల చరాచర సృష్టికి మూలం శివుడే
శ్రీశైలం: సకల చరాచర సృష్టికి మూలం శివుడేనని ప్రముఖ ప్రవాచకులు పద్దిపర్తి పద్మాకర్ తెలిపారు. శనివారం మూడోరోజు జరిగిన దివ్యప్రవచనాల్లో ఆహింస పరమధర్మమని, ఎవరినీ హింసించరాదని తెలిపారు. శివలింగాన్ని పూజిస్తే హింసాపాపం తొలగుతుందని, ఆ పూజ కూడా పంచగవ్యాలతో అభిషేకించిన అనంతరం తడి విభూదిని లేపనం చేసి జలాభిషేకం, బిల్వపత్రాలతో అర్చిస్తే హింసాపాపం తొలగుతుందని తెలిపారు. శివలింగమహిమను విశేషించి వివరిస్తూ నందివర్ధన మహారాజు ఆచరించిన శివార్చనను, శివుడు చెన్నమ్మవ్వప్ప చేసిన సేవను స్వీకరించిన విధానం భక్తుడు శివుడికి చేసిన వాహనసేవ, అతిహృద్యంగా వివరించారు. ఆయోద్యనగర రాజైన మిత్రసహుడు కాశీనగరంలో అగస్తుడు ప్రతిష్టించిన శివలింగాన్ని విస్మరించడం వల్ల నమస్కరించకపోవడంతో కలిగిన దుర్గతిని, తదితర అంశాలను క్షుణ్ణంగా తెలిపారు. కార్యక్రమానికి ముందు ప్రఖ్యాత ప్రవాచకులు డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు, అర్చకులు, వేదపండితులు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.