మృత్యువులోనూ వీడని బంధం | si and his wife died in road accidant | Sakshi
Sakshi News home page

మృత్యువులోనూ వీడని బంధం

Published Sat, Jul 15 2017 10:34 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

మృత్యువులోనూ వీడని బంధం - Sakshi

మృత్యువులోనూ వీడని బంధం

మృత్యువులోనూ వీడని బంధం
ప్రమాదంలో మృతి చెందిన ఎస్‌ఐ దంపతులు
కన్నీరు మున్సీరు అవుతున్న కుటుంబ సభ్యులు
అనాథగా రెండేళ్ళ చిన్నారి 
చింతలపూడిలో విషాద ఛాయలు 
 
చింతలపూడి, ఏలూరు అర్బన్‌ ః
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు... ఇరువర్గాలు అంగీకరించక పోయినా ఒక్కటయ్యారు... కష్టపడి ఉద్యోగం సంపాదించారు... చివరికి మరణంలో కూడా ఇద్దరూ కలిసే వెళ్లిపోయారు. అయితే వారి ప్రేమకు చిహ్నంగా పుట్టిన చిన్నారి మాత్రం అనాథగా మిగిలిపోయింది. చింతలపూడిలో ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న బి.సైదానాయక్‌ (34), అతని భార్య శాంతి శనివారం లింగపాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో చింతలపూడిలో విషాదం నెలకొంది. శనివారం ఉదయం భార్య శాంతి, రెండేళ్ళ కుమార్తె ప్రిన్స్‌తో కలిసి కారులో చింతలపూడి నుండి ఏలూరు బయలు దేరారు. లింగపాలెం సీతమ్మ చెరువు వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ముందు సీటులో పక్కనే కూర్చున్న భార్య శాంతికి తీవ్రగాయాలు కాగా, వెనక సీటులో కూర్చున్న రెండేళ్ల చిన్నారి స్వల్ప గాయాలతో బయటపడింది. గాయపడిన వారిని అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి అక్కడి నుంచి ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో శాంతి(30) మృతి చెందింది. కుమార్తెకు స్వల్ప గాయాలవ్వడంతో చికిత్స చేసి బంధువులకు అప్పగించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
మృత్యువులోనూ వీడని ప్రేమ బంధం 
సైదా నాయక్, శాంతిలది ప్రేమ వివాహం. తాడేపల్లిగూడెం జీఎంఆర్‌ బీఈడీ కళాశాలలో బీఈడీ చదువుతున్న సమయంలో వీరు ప్రేమలో పడ్డారు. 2014లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తరువాత శాంతిని సైదా నాయక్‌ వివాహం చేసుకున్నారు. ఇటీవలే కుమార్తె పుట్టిన రోజు పండుగను ఘనంగా జరిపారు. కలకాలం కలిసి బ్రతుకుదామని బాసలు చేసుకున్న వీరు రోడ్డు ప్రమాదంలో మృతి చెంది మృత్యువులో కూడ కలిసే ఉంటామని నిరూపించారు. తల్లిదండ్రులు చనిపోయిన విషయం తెలియని చిన్నారి ప్రిన్స్‌ను చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. చెట్టు రూపంలో మృత్యువు తల్లిదండ్రులను తీసుకు పోవడంతో చిన్నారి అనాథ అయ్యింది. ఆసుపత్రికి తీసుకు వచ్చిన మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు భోరున విలపించారు. కష్టాలు కడతేరాయనుకుంటే నువ్వే కడతేరిపోయావా కొడకా.. ఎన్నో కష్టాలు పడి తినీ తినకా, రిక్షా తొక్కి నిన్ను పెంచుకుని చదివించుకున్నాను. పోలీసు డ్రస్సులో నిన్ను చూసుకుని మురిసి పోయా, నా కష్టాలు కడతేరిపోయానుకున్నా ఇంతలో నువ్వే కడతేరి పోయావా కొడకా.. అంటూ ఎస్సై సైదానాయక్‌ తండ్రి కోటయ్య ఆ గుండెలు పగిలిపోయాలా రోదించడం చూపరుల కళ్ళు చెమర్చేలా చేసింది. 
సైదానాయక్‌ది కృష్ణా జిల్లా ఇబ్రహింపట్నం. తండ్రి కోటయ్య, తల్లి భద్రమ్మలు వ్యవసాయ కూలీలు. తండ్రి వ్యవసాయ పనులతో పాటు రోజూ రిక్షా తొక్కి కుటుంబాన్ని పోషించడమే కాక కుమారులిద్దరిని చదివించాడు. పెద్దకుమారుడైన సైదా నాయక్‌ చిన్నప్పటి నుండి కష్టపడి చదివి 2011లో జరిగిన ఎస్సై ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి జిల్లాలోని బుట్టాయిగూడెం, ఏలూరులో  ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. 2015 అక్టోబర్‌ నెలలో చింతలపూడి స్టేషన్‌కు బదిలీపై వచ్చారు. అప్పటి నుండి చింతలపూడిలోనే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చిన్న కుమారుడు లక్ష్మణ్‌ ప్రస్తుతం విజయవాడలో బీఎల్‌ చదువుతున్నాడు. ఇతనికి ప్రభుత్వం తరపున ఉద్యోగం ఇప్పిస్తామని హోం మంత్రి చినరాజప్ప హామీ ఇచ్చారు. 
పలువురి పరామర్శ
ఎస్సై సైదా నాయక్‌ అకాలమరణం పాలయ్యారనే వార్త తెలియడంతో పలువురు ప్రముఖులు ఆసుపత్రికి తరలి వచ్చారు. చిన్న వయసులోనే అర్ధంతరంగా భార్యతో సహా ఎస్సై దంపతులు రోడ్డు ప్రమాదంలో మరణించడం పట్ల చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్ళి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని ఆమె తెలిపారు. సైదా నాయక్‌ బ్యాచ్‌లో శిక్షణ పొందిన పలువురు ఎస్‌ఐలు భౌతికకాయాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.
అనాథగా మారిన ప్రిన్స్‌ 
అప్పటి వరకూ తల్లిదండ్రుల ప్రిన్స్‌ (రాకుమారి)గా అల్లారుముద్డుగా ఆటలాడుకున్న సైదా నాయక్‌  ఏడాదిన్నర వయసున్న చిన్నారి కూతురు గంటల వ్యవధిలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. దాంతో ఆ చిన్నారి నేడు అనాథగా మారిపోయింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement