అనారోగ్యంతో జీవిత ఖైదీ మృతి
కడప అర్బన్: కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న కె.నాగశేషు (40) ఆదివారం మధ్యాహ్నం రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు, కేంద్ర కారాగార అధికారులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు...కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం నందమూరినగర్‌లో నివసిస్తున్న కె.నాగశేషు లింగమయ్య, ఈశ్వరమ్మల కుమారుడు. ఇతనికి నలుగురు అక్కా చెల్లెళ్లు, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. 14 సంవత్సరాల క్రితం ఓ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవించేందుకు కడప కేంద్ర కారాగారానికి వచ్చాడు. అప్పటి నుంచి జీవిత ఖైదు అనుభవిస్తూ కొన్ని సంవత్సరాల క్రితం సత్ ప్రవర్తనతో గాంధీజయంతి రోజున విడుదలయ్యాడు. కానీ తిరిగి మరో హత్య కేసులో నేరం రుజువు కావడంతో మళ్లీ జీవిత ఖైదు విధించారు. ఇతను చెడు నడత వల్ల తీవ్ర అనారోగ్యం పాలైనట్లు, చెప్పుకోలేని వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. రెండు వారాల నుంచి కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. అతని బంధువులు మృతదేహాన్ని పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రిమ్స్ సీఐ మోహన్‌ప్రసాద్ తెలిపారు.