
సంబరాల్లో నృత్యం చేస్తున్న ఎంపీ
- డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై ఆనందోత్సాహం
- సిద్దిపేట జిల్లా ఏర్పాటుపై వేడుకలు
- పట్టణంలో భారీ బైక్ ర్యాలీ
- స్వీట్ల పంపిణీ, బాణసంచా మోత
సిద్దిపేట జోన్: తెలంగాణ ఉద్యమ సమయంలో నిరసన ధ్వనులతో హోరెత్తిన సిద్దిపేట.. సరిగ్గా 26 నెలల తర్వాత జిల్లాల పునర్విభజనలో చోటు దక్కడంపై అంతకు రెట్టింపు స్థాయిలో సంబరాలు జరుపుకున్నారు. మూడు దశాబ్దాల కల అడుగు దూరంలో ఉండడంతో పండుగ చేసుకున్నారు.
సోమవారం జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డ్రాప్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో అందులో సిద్దిపేట పేరు ఉండడంతో ఒక్కసారిగా ఉత్సాహం కట్టలు తెంచుకుంది. పట్టణంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. వందలాది మంది టీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, వివిధ సంఘాల ప్రతినిధులు భారీ ర్యాలీ నిర్వహించారు.
బాణ సంచా మోతతో పట్టణం అదిరిపోయింది. స్వీట్ల పంపిణీ, అభినందనలతో సిద్దిపేట పులకించింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఎంపీడీఓ చౌరస్తాలోని బాబూజగ్జీవన్‌రావ్ విగ్రహానికి మెదక్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి పూలమాల వేసి సంబరాలకు శ్రీకారం చుట్టారు. పట్టణ ప్రజలు, వివిధ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాలతో కలిపి టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీని ప్రారంభించారు.
వందలాది వాహనాలతో హైదరాబాద్ మార్గం మీదుగా ర్యాలీ కొనసాగింది. స్థానిక అంబేద్కర్ చౌరస్తా, ఆంధ్రాబ్యాంక్, విక్టరీ చౌరస్తా, ముస్తాబాద్ చౌరస్తాల మీదుగా, వెంకటేశ్వర ఆలయం వరకు సాగింది. గాంధీచౌక్ వద్ద మహాత్ముడి విగ్రహానికి ఎంపీ ప్రభాకర్‌రెడ్డి పూలమాల వేశారు.
అక్కడి నుంచి నేరుగా కమాన్ మీదుగా నర్సాపూర్ చౌరస్తా, కరీంనగర్ రోడ్డు, అంబేద్కర్ నగర్ మీదుగా పాత బస్టాండ్‌కు చేరుకున్నారు. అంబేద్కర్ నగర్‌లో బాబూజగ్జీవన్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి సంబరాలు జరుపుకున్నారు. ఉద్యమ పాటలు అలరించాయి. టీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి ఎంపీ నృత్యం చేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ అక్తర్, మంత్రి ఓఎస్డీ బాల్‌రాజు, మంత్రి వ్యక్తిగత సహాయకలు రాంచందర్‌రావు, జెడ్పీటీసీ యాదగిరి, ఎంపీపీ యాదయ్య, కౌన్సిలర్లు చిప్ప ప్రభాకర్, వెంకట్ గౌడ్, నర్సయ్య, నాగరాజు, ప్రవీణ్, జావెద్, మరుపల్లి శ్రీనివాస్, సత్యనారాయణ గౌడ్, బ్రహ్మం, వజీర్, జంగిటి కనకరాజు, జడేజ, రాజ నరేందర్, సాకి అనంద్, ఐలయ్య, గురజాడ శ్రీనివాస్, కొర్తివాడ రామన్న, సంపత్‌రెడ్డి, నాయకం లక్ష్మణ్, వెంకటేష్, శేషుకుమార్, గుండు రవితేజ, ఉద్యోగ సంఘాల నాయకులు శ్రీహరి, పరమేశ్వర్, అశ్వక్, విక్రమ్ పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.