
అడ్మిషన్ తీసుకుంటున్న శిరీష
మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన మాట ప్రకారం చదువుల తల్లి శిరీష చదువు బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు.
- కాలేజ్ టాపర్ కన్నీటి కథ సుఖాంతం
- చదువుల తల్లి శిరీషకు అండగా నిలిచి నారాయణ కోచింగ్ సెంటర్‌లో చేర్పించిన హరీశ్‌రావు
టేక్మాల్ : మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన మాట ప్రకారం చదువుల తల్లి శిరీష చదువు బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన శిరీషను నారాయణ కోచింగ్ సెంటర్‌లో చేర్చించారు. శిరీషకు ఉన్నత చదువులు చదివే అవకాశం కల్పించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మండలంలోని కాద్లూర్ గ్రామానికి చెందిన నీల్ల దేవమ్మ, రమేష్ కుతురైన శిరీష టేక్మాల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ చదివింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో శిరీష వెయ్యికి 902మార్కులను సాధించి మండల టాపర్‌గా నిలిచింది. చదువుల్లో రాణించే శిరీషకు పై చదువులు చదివేందుకు స్థోమత లేకపోవడంతో సాక్షి ముందుకు వచ్చి కాలేజి టాపర్ కన్నీటి కథ శీర్షికన కథనం ప్రచురించింది. కథనంపై స్పందించిన పలువురు శిరిషకు నగదు సాయం చేశారు.
శిరీష కథనాన్ని చూసిన మంత్రి హరీశ్‌రావు నేరుగా సాక్షి ప్రతినిధికి ఫోన్ చేసి శిరీష చదువుకు తనదే బాధ్యత అని హామీ ఇచ్చారు. అనంతరం శిరీష కుటుంబ సభ్యులు సాక్షి ప్రతినిధి ఆధ్వర్యంలో మంత్రిని కలవగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శిరీష కోరిక మేరకు హైదరాబాద్‌లోని మాదాపూర్ నారాయణ కళాశాల ఎంసెట్ కోచింగ్ సెంటర్‌కు నేరుగా ఫోన్ చేసి అడ్మిషన్ ఇప్పించారు. అంతేకాకుండా శిరీష చెల్లెలు మనూషను పటాన్‌చెరువు మండలం ఇస్నాపూర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఇంటర్‌లో చేర్పించారు.
సాక్షికి కృతజ్ఞతలు
నిరుపేద కుటుంబానికి చెందిన నిరుపేత విద్యార్థికి ఉన్నత చదువు చదివేందుకు కృషి చేసిన సాక్షికి పలువురు అభినందనలు తెలిపారు. సాక్షి కథనం ప్రచురితమైన నాటి నుంచి శిరీష చదువులకు టేక్మాల్ నవ్యభారతి యువజన సంఘం అధ్యక్షుడు నాయికోటి భాస్కర్ వెన్నంటే ఉంంటూ కావాల్సిన మెటీరియల్‌ను సరఫరా చేశారు. అంతేకాకుండా అడ్మిషన్ తీసుకునే వరకు వెన్నంటే ఉన్నారు.
మంత్రి హరీశ్‌రావుకు థాంక్స్
నేను ఇటువటి కళాశాలలో చదువుతానని కలలో కూడా అనుకోలేదు. సాక్షి ప్రచురించిన కథనంతో నాకు ఉన్నత చదువులు చదువుకునే భాగ్యం లభించింది. నన్ను, నా చెల్లెల్ని చదివిస్తున్న మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ శిరీష పేర్కొంది. తాను ఎల్లప్పుడు వారికి రుణపడి ఉంటానంది.