సీతారామ ప్రాజెక్టుకు రెండు వారాల్లో టెండర్లు
అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాను సస్య శ్యామలం చేసేందుకు రూపొందించిన సీతారామ ప్రాజెక్టు పనులకు రెండు వారాల్లో టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టును నిర్ణయించిన లక్ష్యం మేరకు 2018 జూన్ నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. శనివారం ఖమ్మం జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు, జిల్లాకు చెందిన కొందరు నేతల సమక్షంలో రాత్రి 9 గంటల వరకు సీఎం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టుల ద్వారా ప్రతిపాదించిన 3.33 లక్షల ఎకరాలకు అదనంగా మరో 1.5 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా, గతంలో ప్రతిపాదించిన 1.2 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి అదనంగా మరో 10 టీఎంసీల సామర్థ్యం కల్పిస్తూ సుమారు రూ. 7,967 కోట్ల ఖర్చుతో సీతారామ ప్రాజెక్టు చేపడుతున్నట్లు సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాలోని 25 మండలాలు, వరంగల్‌లోని ఒక మండలానికి మొత్తంగా 5 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించేలా రూపకల్పన ఉండాలన్నారు.
కిన్నెరసాని వన్యప్రాణి నివాస ప్రాంతాన్ని తప్పించేలా సర్వే సంస్థ వ్యాప్కోస్, అధికారులు తయారు చేసిన భిన్నమైన అలైన్‌మెంట్‌లపై సీఎం కేసీఆర్ వద్ద చర్చ జరిపారు. అధికారులు సమర్పించిన తుది అలైన్‌మెంట్‌కే సీఎం ఆమోదం తెలిపినట్లుగా తెలిసింది.