వెంకన్న కొండకు.. ఆర్టీసీ దర్శన సర్వీసు
కుటుంబ సమేతంగా తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లాలంటే ఒకటే తర్జనభర్జన. దర్శన టికెట్లు తీసుకోవాలి, రూమ్ బుక్ చేసుకోవాలి, రైలు లేదా బస్సు రిజర్వేషన్ చేసుకోవాలి.. రిజర్వేషన్ దొరికితే దర్శన టికెట్లు ఉండవు, పోనీ దర్శన టికెట్లు ఉన్నాయనుకుంటే రిజర్వేషన్ అందుబాటులో ఉండదు. ఈ గందరగోళం, గజిబిజిలో ఒక్కోసారి ప్రయాణాన్ని రద్దు చేసుకునేవారూ ఉంటారు. అలాంటి అయోమయ పరిస్థితులకు గురికాకుండా భక్తుల కోసం ప్రత్యేక దర్శన సర్వీసులను నడుపుతోంది ఆర్టీసీ. తిరుపతికి బస్ టికెట్ తీసుకుంటే చాలు.. దర్శన టికెట్‌ను ఆర్టీసీనే బుక్ చేసి అందజేస్తుంది. ఆ వివరాలు మీకోసం..
విజయవాడ (బస్‌స్టేషన్) : విజయవాడ నుంచి తిరుపతికి ఆర్టీసీ ప్రత్యేక దర్శన సర్వీసులను నడుపుతోంది. బస్సు టికెట్‌తో పాటే శీఘ్రదర్శన టికెట్లు కూడా ఇస్తారు. ఇందుకోసం రెండు ఏసీ, ఆరు సూపర్ లగ్జరీ సర్వీసులను ఆర్టీసీ అధికారులు ఎంపిక చేశారు. వీటిని ఉదయం 11, సాయంత్రం 4 గంటలకు శీఘ్ర దర్శనం టికెట్లకు అనుసంధానం చేశారు. ఆ సర్వీసుల్లో ప్రయాణించేవారు దర్శనం టికెట్లు తీసుకునే వెసులుబాటు ఉంది. ప్రయాణికులు నిర్ణయించుకున్న తేదీని బట్టి టికెట్లు ఉన్నాయా, లేదా అని విచారణ చేసి, వారి కోరిన ప్రకారం టోకెన్ రూపంలో టికెట్ మంజూరు చేస్తారు. ప్రయాణికులు చెల్లించిన డబ్బుతో టీటీడీ దేవస్థానంలో దర్శనం టికెట్లు కొనుగోలు చేస్తారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి ఈ ప్రత్యేక బస్సు సర్వీసుల ద్వారా తిరుపతి బస్టాండ్‌కు చేరవేస్తారు. అక్కడి నుంచి తిరుమల చేరుకోవాలి. కొండపై ఉన్న ఆర్టీసీ బస్టాండ్ బుకింగ్ సిబ్బందికి టికెట్ చూపిస్తే అప్పటికే తీసుకుని ఉన్న శీఘ్రదర్శనం టికెట్లను భక్తులు అందిస్తారు. వాటిని తీసుకుని దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది.
బస్సుల వివరాలు
సూపర్ లగ్జరీ సర్వీసులు ఉదయం 8.40, 11 గంటలు, మధ్యాహ్నం 2.15, రాత్రి 10.35, 11, 11.45 గంటలకు, ఏసీ సర్వీసులు ఉదయం 10 గంటలకు (అమరావతి స్కానియా), రాత్రి 10 గంటలకు గరుడ బస్సు బయలుదేరుతుంది.
బస్సు చార్జీలు ఇలా..
అధికారులు తిరుపతి వరకూ టికెట్ వసూలు చేస్తారు. వాటితో పాటు అదనంగా ఒక్కో మనిషికి శీఘ్ర దర్శనానికి రూ.300 తీసుకుంటారు. తిరుపతి బస్టాండ్‌లో దిగిన ప్రయాణికులు తిరుమలకు చార్జీలతో వెళ్లాలి.
సూపర్ లగ్జరీ సర్వీసులు : పెద్దలకు రూ.535, పిల్లలకు రూ.262
అమరావతి స్కానియా సర్వీసులు : పెద్దలకు రూ.856, పిల్లలకు రూ.735
గరుడ సర్వీసు : పెద్దలకు రూ.815, పిల్లలకు రూ.650
ఉదయం 11, సాయంత్రం 4 గంటలకు మాత్రమే దర్శనం కల్పిస్తారు. మిగతా సమయంలో ప్రయాణికులే వసతి సదుపాయాలు కల్పించుకోవాలి. ఆర్టీసీ అందుకు బాధ్యత వహించదు.