
రేజింతల్‌లోని శ్రీ సిద్ధి వినాయక ఆలయం
పచ్చని పొలాలు, చుట్టూ కొండలు ఎటూ చూసినా ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వయoభూగా వెలిశారు శ్రీ సిద్ధి వినాయకుడు.
- రేజింతల్ శివారులో స్వయంభూగా వెలిసిన స్వామి
- నలుమూలల నుంచి భక్తుల రాక
- నేడు వినాయక చవితి
- ఆలయంలో ప్రత్యేక పూజలు
న్యాల్‌కల్: పచ్చని పొలాలు, చుట్టూ కొండలు ఎటూ చూసినా ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వయoభూగా వెలిశారు శ్రీ సిద్ధి వినాయకుడు. రేజింతల్ గ్రామ శివారులో ఉన్న ఈ ఆలయం దిన దినాభివృద్ధి చెందుతోంది. స్వామి వారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా సమీపాన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రాలకు చెందిన భక్తులు వస్తుంటారు. ప్రసిద్ధి గాంచిన వినాయక ఆలయాల్లో మొదటిది చిత్తూరు జిల్లా కాణిపాకం కాగా, రెండోవది రేంజితల్ గ్రామ శివారులో వెలిసిన శ్రీసిద్ధి వినాయక ఆలయం.
కోరిన కోర్కెలు తీర్చే స్వామి వారి జయంతి ఉత్సవాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. వాటితో పాటు వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నవరాత్రి ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. గురువారం నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఆలయ ప్రత్యేకత
చుట్టూ కొండలు, పచ్చని పొలాల మధ్య స్వయంభూవుగా వెలిసిన సిద్ధి వినాయకుడు కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల నీరాజనాలందుకుంటున్నారు. శుభ కార్యాల సమయాల్లో.. పూజలు చేసేటప్పుడు ప్రథమంగా వినాయకుడిని పూజించిన తర్వాతే ఇతర కార్యక్రమాలను ప్రారంభించడం ఆనవాయితీ.
గ్రామీణ ప్రాంతాలలో వినాయక ఆలయాలు ఉండడం అరుదు. మన రాష్ట్రంలో ఐదు, కర్ణాటక రాష్ట్రంలో ఒక స్వయంభు వినాయక ఆలయాలున్నాయి. ఒక్క న్యాల్‌కల్ వుండలంలోనే స్వయంభు వినాయక ఆలయాలు ఉండడం విశేషం.
విగ్రహం ఉద్భవించిన తీరు
స్వయంభూగా వినాయకుడు ఉద్భవించిన తీరు మరాఠి భాషలోని లఘు విభక్తి విజయగ్రంథం ఆధారంగా వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు సుమారు 20కిలో మీటర్ల దూరంలో చింతల్‌గిరి గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన బ్రహ్మణుడైన శివరాంభట్ నిత్యం నియమ నిబద్ధతలతో వినాయక, వెంకటేశ్వర స్వాములను పూజిస్తుండే వారు. సంధ్యావందనం, గాయత్రి జపం వంటి కార్యక్రవూలు చేపట్టేవారు. మన రాష్ట్రంలోని వరంగల్‌కు చెందిన విమర్శనంద మహారాజ్ తన శిష్యుడైన శివరాం భట్‌లు కలిసి బోధనలు చేశారు. 217 సంవత్సరాల క్రితం శివరాం భట్ తిరుపతి తీర్థ యాత్రకు చింతల్‌గిరి నుంచి రేజింతల్ గ్రామ శివారు మీదుగా కాలిబాటనే వెళుతుండగా.. రేజింతల్ గ్రామ శివారులోకి రాగానే పూజా సమయం కావడంతో అక్కడే పూజలు నిర్వహించారు. ఆయన చేసిన పూజలకు ప్రసన్నుడైన వినాయకుడు భూమిని చీల్చుకుని చిన్న మూర్తి రూపంలో ఉద్భవించాడనే విషయం విజయ గ్రంథం ఆధారంగా తెలుస్తోంది.
విగ్రహం పెరుగుదల
రేజింతల్ గ్రావు శివారులో వెలిసిన సిద్ధి వినాయకుడు ప్రతి సంవత్సరం కొంత మేర విగ్రహం పెరుగుదల కనిపించడంతో ప్రజలు వినాయకుడిని దర్శించుకునేందుకు తండోపతండాలుగా రావడం ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటక, వుహారాష్ట్ర భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చి దర్శనం చేసుకుంటారు.
ఆలయ ప్రత్యేకతలు
దేశంలో ఎక్కడా లేని విధంగా ఆలయంలో వినాయకుడి ముఖం దక్షిణం వైపు ఉంది. ఇక్కడి వినాయకుడికి చందన లేపనం చేయడం ప్రత్యేకత.
సంకష్ట హర చతుర్థి
ప్రతి మాసంలో పౌర్ణమి అనంతరం వచ్చే మూడో రోజును సంకష్ట హర చతుర్థిగా, వినాయకుడి ఇష్ట దినమైన మంగళవారం వచ్చే సంకష్ట హర చతుర్థిని అంగారక చతుర్థిగా భక్తులు కొలుస్తారు. రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, వుహారాష్ట్రలలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కాలినడకన ఆలయానికి వచ్చి దైవదర్శనం చేసుకుంటారు. కాలినడకన వచ్చి స్వామి వారిని దర్శించుకుంటే కోరిన కోరికలు ఫలిస్తాయనేది భక్తుల విశ్వాసం.