ప్రత్యేక హోదాపై డ్రామాలొద్దు
– హోదా రాకుండా టీడీపీ, బీజేపీలే అడ్డుకుంటున్నాయి
– వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని
– రేపటి జిల్లా బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు :
రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా బీజేపీ, టీడీపీలు అడ్డుకుంటున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. హోదా విషయంలో ఆ రెండు పార్టీలు డ్రామాలాడుతున్నాయన్నారు. ఇందుకు నిరసనగా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహ¯Œæరెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నిర్వహించ తలపెట్టిన జిల్లా బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. హోదా లేకుండా రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదని, హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని, రాయితీలు వస్తాయని.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో హోదా ఇవ్వకపోతే రాష్ట్రం కోలుకోవడం కష్టసాధ్యమన్నారు. అన్ని తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ హోదాపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటం లేదని బాలినేని విమర్శించారు. ప్రజలే ఉద్యమించి హోదాను సాధించుకోవలసిన సమయం ఆసన్నమైందన్నారు. హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఆది నుంచి పోరాటం సాగిస్తోందన్నారు. మంగళవారం జరిగే బంద్‌ను రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలని, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బంద్ విజయవంతమయ్యేలా కృషి చేయాలని పార్టీ శ్రేణులను కోరారు.