నవ్వుల రారాజు ఆది | special story om adhi | Sakshi
Sakshi News home page

నవ్వుల రారాజు ఆది

Published Sat, Dec 24 2016 9:44 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

నవ్వుల రారాజు ఆది - Sakshi

నవ్వుల రారాజు ఆది

మాటల్లో గోదావరి వెటకారం.. డైలాగుల్లో టైమింగ్‌ మిస్సవని స్పీడ్‌.. కడుపు చెక్కలయ్యేలా నవ్వుకునే హాస్యం.. మొత్తం కలిపితే అది ‘హైపర్‌ ఆది’. బుల్లితెరపై అరగంట పాటు ఉన్నా ఫటాఫట్‌ మంటూ పంచ్‌లు వేస్తూ నవ్వులు పూయిస్తాడు. సిల్కు చొక్కా, సిల్కు లుంగీ ఆహార్యంలో తనదైన మేనరిజంతో దూసుకుపోతున్నాడు. అతను నోరు తెరిస్తే పవర్‌.. పంచ్‌ వేస్తే హైపవర్‌ అనిపించుకుంటున్నాడు. అందుకే అతడి మేనరిజానికి నవ్వులలోకం జీహుజూర్‌ అంటోంది.. సోషల్‌ మీడియాలో అతడిని 40 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఈ నవ్వుల నటరాజు తను అనుభవాలను, అనుభూతులను ‘సాక్షి’తో పంచుకున్నాడు. 
                                                                                   – సాక్షి, హైదరాబాద్‌


పాతికేళ్ల వయసున్న ఆది తక్కువ కాలంలోనే నవ్వల వేదికపై తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఆక్రమించాడు.. స్టేజీపై కొద్దిసేపే ఉన్నా అందరి మనస్సుల్లో సంతోషాన్ని నింపుతాడు. అతని పంచ్‌ డైలాగులకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్, బ్రహ్మానందం నుంచి ప్రశంసలు సైతం పొందాడు. ఇక ఆయన చేసే కార్యక్రమాలకు న్యాయనిర్ణేతలుగా ఉండేవారి సంగతి చెప్పనక్కర్లేదు.. ఆది వస్తే వేదికపై జడ్జిలు కూడా అతడి పంచ్‌ల కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తారు.

ప్రయాణం అలా మొదలైంది..
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పల్లామల్లి గ్రామం మాది. మా నాన్న కోట నర్సింగరావు, అమ్మ సుబ్బులు ఇద్దరు రైతులే. బీటెక్‌ చదివి ఏడాదిన్నర పాటు ఉద్యోగం చేశాను. కానీ మనసంతా నటనపైనే. ఆ కోరిక వెండి తెరవైపు మళ్లించింది. ప్రయత్నాలు చేసినా అవకాశాలు లభించలేదు. అయితే, అప్పటికే పాపులర్‌ అయిన ఓ టీవీ కామెడీ షోలో కనిపించాలని ఉబలాటపడ్డాను. ఆ చాన్సు కోసం అన్నపూర్ణ స్టూడియో గేటు వద్ద మకాం వేయడం ప్రారంభించాను. లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తే సెక్యూరిటీ గార్డులు మెడపట్టి గెంటేశారు. ఇప్పుడు ఆ గార్డులే ఆదితో సెల్ఫీలు దిగుతుండడం ఆనందంగా ఉంది. చాన్సు కోసం ప్రయత్నిస్తుండగా ‘అభి’ నాకు అవకాశం కల్పించాడు. ఆ అవకాశాన్ని వినియోగించుకుని ఓ చిన్న పాత్రతో అందరిని ఆకట్టుకోగలిగాను. ఇక రోజా, నాగబాబు సహకారం మరువలేనిది.

పంచ్‌లు నా నైజం..
చిన్నప్పటి నుంచి పంచ్‌లు వేయడం అలవాటు. స్నేహితులతో కలిసి తిరిగేటప్పుడు ఎదుటి వారు ఎదైనా మాట్లాడితే సందర్భానుసారంగా వెంటనే తిరిగి పంచ్‌ వేసేవాణ్ని. అదే అలవాటు ఇప్పుడు నన్ను ఇలా మీ ముందు కూర్చొనేలా చేసింది. నలుగురిలో ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. ఇలా ఉండటం, సమాజాన్ని చదవడం వల్ల మనం చేయాలనుకొనే కార్యక్రమానికి మాటలను వేదికగా మలుచుకుంటాను. ఇందుకోసం ఓ రోజంతా కష్టపడతాను. నాకు సంబంధించిన డైలాగ్‌లు నేను రాసుకుంటాను. ఒక్కోసారి స్కిట్‌లో సందర్భానుసారంగా అప్పటికప్పుడు మాటలను పేలుస్తుంటాను. ఇవి ఒక్కోసారి మిస్‌ఫైర్‌ కూడా అవుతుంటాయి. అందువల్ల కొంతమంది బాధపడుతుంటారు. కానీ కాసేపటి తరువాత వారే హాస్యం కోసమని అర్థం చేసుకొని నవ్వుకుంటారు.

మహిళలంటే గౌరవం..
‘నా నవ్వుకు ఎంతమంది చనిపోతారో తెలుసా’.. అంటూ ఓ యాంకర్‌ అంటే.. వీలుచూసుకొని ఓసారి మా ఇంటికి రామ్మ,. మా ఇంట్లో చాలా ఎలుకలున్నాయంటూ’ డైలాగ్‌ పేల్చినా.. ఏంటి నోరు లేస్తుంది అంటే.. ‘నోరు తెరిస్తే నోరు లేవక నాగార్జున సాగర్‌ డ్యాం లేస్తుందా’ అంటూ పంచ్‌ విసిరినా.. నలుగురు ఆడాళ్లు ఉంటే శ్రీమంతం ఎలా అవుతుంది చీటి పాటవుతుందంటూ పెళ్లాంపై ఎన్ని జోకులు వేసినా మహిళలంటే నాకు ఎంతో గౌరవం. కేవలం హాస్యం కోసం ఇదంతా చేస్తుంటాను.

నవ్వుల ముద్రనే..
నా పంచ్‌ డైలాగ్‌లకు ఇప్పుడు చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి. వెండితెరపైకి వెళ్లాలని అనుకుంటున్నాను. బ్రహ్మానందం నాకు ఆరాధ్యం. నా జీవితంలో రోజా, నాగబాబు, త్రివిక్రమ్, బ్రహ్మానందం, చిరంజీవి అమ్మగారు ఇచ్చిన కితాబులను ఎప్పటికీ మరిచిపోలేను. ప్రభుత్వ పాఠశాలలో మొదలైన నా ప్రస్థానం పాఠశాలలో, కళాశాలలో ప్రథమ స్థానంలో నిలిపింది. ఇప్పుడు ఈ నవ్వుల లోకంలో కూడా వెలిగిపోవాలనేదే నా కోరిక.. అంటూ ముగించాడు హైపర్‌ ఆది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement