కట్టలు తెగిన అవినీతి
– బయటపడుతున్న శ్రీశైలం మాజీ ఈవో అక్రమాలు
– కర్నూలులో లాకర్ తెరిచిన ఏసీబీ అధికారులు
– రూ. 40,47,500 నగదు, ముప్పావు కిలో వెండి స్వాధీనం
– గుంటూరులో మూడో లాకర్ తెరుస్తామన్న ఏసీబీ డీఎస్పీ
కర్నూలు(టౌన్): శ్రీశైలం మాజీ ఈవో కంచర్ల సాగర్‌బాబు అక్రమ ఆస్తులు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. గురువారం విజయవాడలో సోదాలు నిర్వహించిన ఏసీబీ ఆధికారులు శుక్రవారం కూడా కొనసాగించారు. కర్నూలు బీక్యాంపు విజ్ఞాన మందిరం ఆంధ్రాబ్యాంకు బ్రాంచ్‌లో లాకర్‌ను తెరవగా అక్రమ ఆస్తులు వెలుగుచూసాయి. ఏసీబీ ప్రత్యేక బందానికి చెందిన డీఎస్పీ రమాదేవి నేతత్వంలో ఇద్దరు ఎస్‌ఐలు, సిబ్బంది, శ్రీశైలం మాజీ ఈవో సాగర్‌బాబుతో కలిసి మధ్యాహ్నం 2.50 గంటలకు బ్యాంకుకు చేరుకున్నారు. బ్యాంకు మేనేజర్ సుబ్రమణ్యాన్ని కలిసి అకౌంట్, లాకర్ వివరాలను తెలుసుకున్నారు. బ్యాంకులో సాగర్‌బాబు తన భార్యపేరు మీద జాయింట్ అకౌంట్‌తో లాకర్ ఉంచారు. దాన్ని తెరువగా వెయ్యి, ఐదువందల నోట్ల కట్టలు కనిపించాయి. ట్రేలలో తెచ్చి ఎంచేందుకు వీలు కాకపోవడంతో మనీ కౌంటింగ్ మిషన్ ద్వారా వాటిని లెక్క కట్టారు. రెండు గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. మొత్తం రూ. 40,47,500 నగదు బయట పడింది. అలాగే వెండి భరిణిలు, కప్పులు ఉన్నాయి. వీటి బరువు ముప్పావు కిలో ఉంది. వీటిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరులో మూడో లాకర్ తెరుస్తాం: ఏసీబీ డీఎస్పీ రమాదేవి
సాగర్‌బాబుకు సంబంధించి ఇప్పటి వరకు రెండు లాకర్లు తెరిచాం. శనివారం గుంటూరులో ఉన్న మూడో లాకర్‌ను తెరుస్తాం. సాగర్‌బాబు ఆస్తులకు సంబంధించి ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాం. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో ఏసీబీ డైరెక్టర్ జనరల్ మాలకొండయ్య ఆదేశాల మేరకు సోదాలు నిర్వహిస్తున్నాం. విజయవాడ ఆంధ్రా బ్యాంకులో రూ. 49,30,000 నగదు, 36 తులాల బంగారం బయట పడింది. రెండు లాకర్ల ద్వారా ఇప్పటి వరకు రూ. 89,50,000 నగదును సీజ్ చేశాం. మూడో లాకర్ సాగర్‌బాబుకు బినామీగా వ్యవహరిస్తున్న శ్రీశైలం ఉద్యోగి శ్రీనివాసరావు పేరు మీద ఉంది. నగదు కాకుండా ఆరు ప్లాట్లు, జిప్లస్ 1 ఇల్లు, స్కార్పియో, ఇండికా కార్లు, నాలుగు ఎకరాల పొలం ఉన్నట్లు గుర్తించాం. సాగర్‌బాబు అవినీతికి సంబంధించి ఏవైనా వివరాలు ఉంటే నిర్భయంగా ఇవ్వవచ్చు. పేర్లు గోప్యంగా ఉంచుతాం.