
శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలో అగ్ని ప్రమాదం
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి ఆలయ ప్రధా న ద్వారం భిక్షాల గోపురం సమీపంలో గురువారం రాత్రి 11.16 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో 20 దుకాణాలు పూర్తిగాను, 15 దుకాణాలు పాక్షికం గా కాలిపోయాయి. స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో అధికారులు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. పది నిమిషాలకే యంత్రంలో నీరు అయిపోయింది. అగ్నిమాపక యంత్రం నీటి కోసం భరద్వాజతీర్థం వద్దకు వెళ్లింది. ఇంతలో మంటలు తారస్థాయికి చేరుకున్నాయి. కొంతమేరకు అదుపు చేసినప్పటికీ ఇంకా మంటలు ఎగసి పడుతూనే ఉన్నాయి. దుకాణాల్లో ఉన్న గ్యాస్ సిలిండర్లను వెంటనే పక్కకు తరలించారు. విద్యుత్ సరఫరా ఆపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
ఆలయ ఆవరణలో అగ్ని ప్రమాదం జరగడంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఆలయు చైర్మన్ గురవయ్యనాయుడు, పలువురు సభ్యులు, డీఎస్పీ వెంకటకిశోర్ అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయుత్నం చేస్తున్నారు. నీటి కొరతతో ఇబ్బందులు తప్పడంలేదు. రాత్రి 12.30 గంటలకు మంటలు ఎగసి పడుతూనే ఉన్నాయి. పలువురు దుకాణదారులు ఏళ్ల తరబడి ఆలయానికి చెందిన విద్యుత్‌నే వినియోగిస్తున్న విషయుం తెలిసిందే.
ఇటీవల తప్పనిసరిగా ప్రైవేటుగా మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని ఆలయ అధికారులు ఆదేశించారు. దీంతో కొందరు అడ్డదిడ్డంగా విద్యుత్ వైర్లు లాక్కున్నారు. ఈ క్రమంలోనే షార్ట్‌సర్క్యూట్ అయిందని స్థానికులు అంటున్నారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతం సమీపంలోనే ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ ఉండడంతో ఖాతాదారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.