-1.59లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
-11,320 క్యూసెక్కులు ఔట్ ఫ్లో
-హంద్రీనీవా, పోతిరెడ్డిపాడుకు నీటిని విడుదల చేసిన ఏపీ
సాక్షి, హైదరాబాద్
రెండేళ్ల తర్వాత కృష్ణా నది వరదల కారణంగా శ్రీశైలం నిటి నిల్వ తొలిసారి వంద మార్కును దాటింది. ఎగువ నుంచి కొనసాగుతున్న ప్రవాహాల కారణంగా శ్రీశైలంలోకి ఈ ఏడాది ప్రస్తుతం వరకు 91 టీఎంసీల మేర కొత్త నీరు రాగా, ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్ధ్యం 102.8 టీఎంసీలకు చేరింది.
ఎగువ నుంచి 1.59క్యూసెక్కుల మేర ప్రవాహాలు కొనసాగుతుండటంతో నిల్వలు మరింత పెరిగే అవకాశం ఉంది. శ్రీశైలం వాస్తవ నిల్వ సామర్ధ్యం 215.8టీఎంసీలు కాగా గత ఏడాది ఇదే సమయానికి కేవలం 30.40 అడుగుల నీరు మాత్రమే ఉంది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం 72 టీఎంసీల మేర అదనపు నీరుండటం తెలుగు రాష్ట్రాలకు ఊరటనిచ్చేదే.
ఎగువ కర్ణాటకలో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రవాహాలు మాత్రం స్ధిరంగా కొనసాగుతున్నాయి. ఆల్మట్టిలోకి 1.76లక్షల కక్యూసెక్కుల వరద వస్తుండగా 1.28లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ నారాయణపూర్‌కు వదులున్నారు. నిరాయణపూర్‌కు సైతం 1.69లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా అంతే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు.
సోమవారం సైతం జూరాలకు 1,50,537 క్యూసెక్కుల ప్రవాహాం కొనసాగడంతో 1.32లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలానికి వదిలారు. శ్రీశైలంలోకి మొత్తంగా 1.59లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో నీటి మట్టం 859 అడుగులకు చేరింది. భారీగా నీరు రావడంతో పవర్‌హౌస్ ద్వారా 11,320 టీఎంసీల నీటిని, హంద్రీనీవా అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ 1352 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు కాల్వల ద్వారా 2,570 క్యూసెక్కుల నీటిని తరలించుకుంటోంది.
పవర్ హౌస్ ద్వారా వదిలిన నీటిలో 10,983 క్యూసెక్కుల మేర నీరు నాగార్జునసాగర్‌లోకి వస్తోంది. అధికారుల లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు జూరాలకు 97.61టీఎంసీలు, శ్రీశైలానికి 87.76టీఎంసీలు, సాగర్‌కు 10.02 టీఎంసీల కొత్త నీరు వచ్చింది. ఈ లెక్కన మొత్తంగా 195.39 టీఎంసీల మేర నీరు కృష్ణాలో ఈ ఏడాది లభించినట్లయింది. ఎగువ కర్ణాటకలో మాత్రం ఏకంగా 400 టీఎంసీల మేర కొత్త నీరు వచ్చింది.