శ్రీప్రకాష్‌లో రాష్ట్రస్థాయి నాటిక పోటీలు ప్రారంభం
తుని : సినిమారంగంలో మహానటులుగా ప్రజల అభిమానాన్ని పొందిన ఎందరికో నాటకరంగం మాతృమూర్తి వంటిదని జూనియర్ సివిల్ జడ్జి ప్రమీలారాణి అన్నారు. పాయకరావుపేట శ్రీప్రకాష్ విద్యాసౌధంలో గురువారం రాత్రి ‘అజో- విభో కందాళం ఫౌండేషన్, శ్రీ ప్రకాష్ ఎడ్యుకేషన్, కల్చరల్ అసోసియేషన్’ సంయుక్తంగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి నాటిక పోటీలను ఆమె జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల కార్యదర్శి సీహెచ్ విజయ్‌ప్రకాష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తెలుగు నాటకరంగంలో ఒక విశిష్ట వ్యక్తికి చిరు సత్కారం పేరిట శ్రీ ప్రకాష్ పూర్వ విద్యార్థి, రాజస్థాన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ తూము శివ ప్రసాద్‌ను సత్కరించారు. విదేశాల్లో ఉంటూ అజో విభో కందాళం ఫౌండేషన్ స్థాపించి తెలుగు నాటికలను ప్రజలకు అందించిన ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అప్పాజోస్యుల సత్యనారాయణకు అభినందనలు తెలిపారు. ఫౌండేషన్ రూపొందించిన వైజయంతి సమ్మోనోత్సవ విశేష సంచికను విజయ్‌ప్రకాష్, కథానాటికలు–2017 పుస్తకాన్ని దంటు సూర్యారావు ఆవిష్కరించారు. దంటు సూర్యారావు, కేఆర్‌జే శర్మ, ఎన్.తారకరామారావు, డి.రామకోటేశ్వరరావు, డాక్టర్ కె.వీర్రాజు, ఆహ్వానసంఘం కన్వీనర్ డీఎస్‌ఎన్ మూర్తి, ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్.మూర్తి పాల్గొన్నారు. తొలిరోజు ‘నాన్నా! నువ్వు సున్నావా?’, ‘గోవు మాలచ్చిమి’, ‘దగ్ధగీతం’ నాటికలను ప్రదర్శించారు.