
ప్రకాష్(ఫైల్)
సెలవు ప్రకటించిన బూర్గుపల్లి పాఠశాల
కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు
కొత్తపల్లిలో విషాదం
మెదక్ రూరల్: డెంగీ వ్యాధితో ఓ విద్యార్థి చికిత్సపొందుతూ మృతి చెందిన సంఘటన మెదక్ మండలం కొత్తపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబీకులు, గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కొత్తపల్లిలోని మనిగిరి మల్లయ్య, లక్ష్మి దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.
కొడుకు మనిగిరి ప్రకాష్(12)బూర్గుపల్లిలోని ప్రభుత్వ వసతిగృహంలో ఉంటూ అక్కడే ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంలో 6వ తరగతి చదువుతున్నాడు. హాస్టల్‌లో ఉండగా 15 రోజుల క్రితం అస్వస్థతకు గురికావడంతో హాస్టల్ సిబ్బంది ప్రకాష్‌ను ఇంటికి పంపించారు. జ్వరంతో బాధపడుతున్న కొడుకును మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
రెండు రోజులు చికిత్సలు నిర్వహించగా వైద్యుల సలహా మేరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ అస్పత్రికి తరలించారు. అక్కడ రక్త కణాల సంఖ్య తగ్గిపోవడంతో పరీక్షలు నిర్వహించిన వైద్యులు డెంగీగా నిర్దారిచారు. వ్యాధి మెదడుకు సోకడంతో పరిస్థితి విషమించి 13 రోజులపాటు చికిత్సపొంది బుధవారం తెల్లవారు జామున మృతి చెందాడు.
మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న బూర్గుపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు సంతాపం ప్రకటించి పాఠశాలకు సెలవు ఇచ్చారు. ప్రకాష్ కుటుంబీకులను పరామర్శించి సంతాపం తెలిపారు. కళ్ల ముందే కదలాడిన ఉన్న ఒక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలను ఆపడం ఎవరితరం కాలేదు. ప్రకాష్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకొన్నాయి.