- విద్యా, కళలు, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
- మారుమూల గ్రామాలే దత్తత
- నిరాక్షరాస్యత, డ్రాప్ అవుట్స్ వద్దు
విద్యార్థుల వికాసానికి ‘ఎర్త్’
Published Wed, Jul 27 2016 10:57 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
సుల్తానాబాద్ : పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఎర్త్ ఫౌండేషన్ ముందుకు సాగుతోంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందుతున్న విద్యలో సమూలమైన మార్పులు తేవడానికి తమవంతు ప్రయత్నం చేస్తోంది. కరీంనగర్, నల్గొండ జిల్లాలోని పాఠశాలలను దత్తత తీసుకుని విద్యార్థులకు చేయూతనందిస్తోంది. డ్రాప్ అవుట్స్, నిరాక్షరాస్యత, పేదరికంతో బడులకు వెళ్లకుండా ఉన్నవారిని గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పించే బాధ్యత తీసుకుంటూ ఆదర్శంగా నిలుస్తోంది.
2012 ఏప్రిల్ 18న అమెరికాలో స్థిరపడ్డ కరీంనగర్‌కు చెందిన ప్రమోద్‌కుమార్‌రెడ్డి ఎర్త్ ఫౌండేషన్‌ను స్థాపించారు. తానుచేసిన సహాయం స్వచ్ఛంద సంస్థల ద్వారా విద్యార్థులకు అందడంలేదని భావించి ఆయన ఈ ఫౌండేషన్ ఏర్పాటుకు శ్రీకారంచుట్టారు. పేదరికంలో ఉండి చదువుకోలేని పిల్లలకు సాయమందించడమే ప్రధాన ఉద్దేశం. పిల్లలకు జిల్లాలో సుల్తానాబాద్ మండలం భూపతిపూర్, గర్రెపల్లి, కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీకాలనీ, పెద్దరాతుపల్లి, ముత్తారం మండలకేంద్రం, మల్యాల మండలం లంబాడిపల్లెలోని ప్రభుత్వ పాఠశాలలతోపాటు నల్గొండ జిల్లా భీమ్‌నగర్ మండలం రాఘవపూర్, చౌట్‌పల్లి మండలం మల్కాపూర్ గ్రామాల్లో పాఠశాలలను ఫౌండేషన్ దత్తత తీసుకుంది. విద్యావలంటీర్లతో బోధన చేయిస్తున్నారు. 70 మంది స్వచ్ఛందంగా సేవ చేస్తుండగా.. 38 మంది వలంటీర్లకు గౌరవవేతనం సంస్థ ఇస్తోంది. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, దుస్తులు, టైలు, బెల్టులు, బ్యాడ్జీలు అందిస్తోంది. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించింది. పాఠశాలల్లో నెలకోసారి వైద్యశిబిరాలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేస్తున్నారు. తల్లిదండ్రులకు అవగాహన సదస్సులు నిర్వహించి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. వీరిసేవల ద్వారా 570 మంది విద్యార్థులు లబ్ధిపొందుతున్నారు. ఇందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అమెరికాలో ఉంటున్నఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రమోద్‌కుమార్‌రెడ్డి అందిస్తున్నారు.
నైపుణ్యాన్ని వెలికితీసేందుకే...
విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యత వెలికితీసి విద్యావంతులను చేయడమే ఎర్త్ ఫౌండేషన్ ఉద్దేశం. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు మావంతు ప్రయత్నం చేస్తున్నాం. దత్తత తీసుకున్న పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన దుస్తులు, పాఠ్యపుస్తకాలు, బెల్టులు అందిస్తున్నాం.
–కలవేని శ్రీనివాస్, రాష్ట్ర కోఫౌండర్, కరీంనగర్
తల్లిదండ్రులతో సమావేశాలు
పాఠశాలల అభివృద్ధికి చేయూతనిస్తున్నాం. తల్లిదండ్రులను చైతన్యవంతం చేసేందుకు ఎస్‌ఎంసీ సమావేశాలు నెలవారీగా నిర్వహిస్తున్నాం. పిల్లలకు వైద్యపరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నాం. ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛభారత్, మొక్కలపెంపకం వంటి కార్యక్రమాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం.
వెన్నెల, కోఆర్డినేటర్, భూపతిపూర్
గోడలపై పెయింటింగ్..
ఎర్త్ ఫౌండేషన్ దత్తత తీసుకున్న పాఠశాలలో గోడలపై విద్యార్థులకు అర్థమయ్యేలా ఆకర్షణీయమైన రంగులతో పలు బొమ్మలు వేస్తున్నాం. జాతీయ చిహ్నాలు, మానవ ఆకృతులు, అక్షరమాలలు, శరీరంలోని విడివిభాగాలను వేసి అవగాహన కల్పిస్తున్నాం.
–హేమవతి, వాలంటీర్, భూపతిపూర్
ప్రైవేటుకు దీటుగా బోధన
ప్రైవేటు పాఠశాలల మాదిరిగా మాకు దుస్తులు ఇచ్చారు. ఆంగ్లంలో విద్యా బోధన చేస్తున్నారు. నెలకు ఒకసారి పేయింటింగ్, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా ప్రభుత్వ పాఠశాలలో చెబుతున్నారు.
–చిట్టి, అయిదో తరగతి విద్యార్థిని, భూపతిపూర్
Advertisement
Advertisement