తల్లిదండ్రులతో బాధితురాలు
రెండు కిడ్నీలు పాడైన విద్యార్థిన
పేదరికంతో అందని ఉన్నత వైద్యం
బలిజిపేట రూరల్: చదువులో రాణిస్తున్న కుమార్తెను చూసి మురిసిపోయాడు. బంగారు భవిత కోసం కలలుగన్నాడు. రెక్కలు ముక్కలు చేసుకుని చదివిస్తున్నాడు. అంతలోనే ఊహించని ఉపద్రవం. కుమార్తెకు తీవ్ర అనారోగ్యం చేసింది. అన్నం మెతుకులకే సరిపోని ఆదాయంతో వైద్యమెలా చేయించాలి?.. బిడ్డను ఎలా కాపాడుకోవావాలి?.. అంటూ పెదపెంకి గ్రామానికి చెందిన రిక్షా కార్మికుడు పి.బాల కుమిలిపోతున్నాడు. దయగల దాతలు కరుణించి కిడ్నీ జబ్బుతో క్షీణిస్తున్న తన కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టాలని కన్నీటితో విన్నవిస్తున్నాడు.
భవితపై నీలినీడలు
రిక్షా కార్మికుడు పి.బాల కుమార్తె పారమ్మ (22) కు రెండు కిడ్నీలు పాడవ్వడంతో అయిదు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. కుమార్తె వైద్యానికి ఇప్పటికే సుమారు రూ.3 లక్షల వరకు వెచ్చించడంతో ఆర్థికంగా చితికిపోయాడు. పారమ్మ డిగ్రీ పూర్తి చేసింది. పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించింది. భవిషత్‌లో మంచి ఉద్యోగాన్ని సాధించాలనే పట్టుదలతో చదువుతున్న పారమ్మకు కిడ్నీలు పాడైపోవడంతో ఆమె భవితపై అంధకారం అలముకుంది.
ఎన్టీఆర్‌వైద్యసేవ అంతంతమాత్రమే
అయినెలల క్రితం పారమ్మకు కాళ్లు పొంగడంతో బొబ్బిలిలో వైద్యులను సంప్రదించారు. వారి సూచనలతో విజయనగరం వైద్యులకు చూపించగా ఎనీమియా క్రానిక్ వల్ల రెండు కిడ్నీలు పాడైనట్టు నిర్థారించారు. విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ చేయించినా ప్రయోజనం లేకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రిని ఆశ్రయించామని తల్లిదండ్రులు తెలిపారు. ఎన్టీఆర్ వైద్యసేవ కార్డున్నా డయాలసిస్‌కు మాత్రమే ఉపయోగపడుతోందన్నారు. కార్డుద్వారా ప్రభుత్వం సరఫరా చేసిన మందుల శక్తి తక్కువ కావడంతో ప్రైవేటు వైద్యులు సూచించిన ఖరీదైన మందులు కొనుక్కోవలసి వస్తోందని తెలిపారు. నెలకోసారి చేయించుకోవలసిన 6000 ఐయు పవర్ రీనోసెల్ ఇంజక్షన్ ఖరీదు రూ.2,100 అని తెలిపారు. ఇవికాక మందులకు నెలకు రూ.15వేలు ఖర్చవుతోందని వివరించారు. దయగల దాతలు 9573808933 నంబర్‌కు ఫోన్ చేసి సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.