రాజంపేట టౌన్ : విద్యార్థులు డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ అడుగుజాడల్లో నడవాలని అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి సీ.చెన్నయ్య పిలుపునిచ్చారు. ఈనెల 14వ తేదీ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు ‘అంబేడ్కర్ జీవితం’ అనే అంశంపై వ్యాసరచన పోటీలతో పాటు చిత్రలేఖనం, క్విజ్‌పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను చెన్నయ్య ప్రారంభించి మాట్లాడారు. భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన విద్యార్థులు అంబేడ్కర్ ఆశయాలు, ఆలోచనలతో ముందుకు సాగాలని కోరారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ కృషి ఫలితంగానే భారతదేశ ప్రజలు రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను అనుభవిస్తున్నారన్నారు. అంబేడ్కర్ ఆశయాలు, ఆదర్శాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. అంబేడ్కర్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం కావాలని చెన్నయ్య తెలిపారు. ఈనెల 14వ తేదీ అంబేద్కర్ జయంతిని వాడవాడలా ఘనంగా నిర్వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ ప్రతినిధులు, ఉపాధ్యాయులు ఎన్.శివరామయ్య, ధర్మరాజు నాయక్, ఎం.రాజయ్య, జీ.పెంచలయ్య, డి.చెంగల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు అంబేడ్కర్ అడుగుజాడల్లో నడవాలి
Published Wed, Apr 12 2017 6:04 PM | Last Updated on Tue, Sep 5 2017 8:36 AM
Advertisement