- లక్ష్య సాధనే ధ్యేయంగా దూసుకుపోతున్న క్రీడాకారులు
- జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు చంద్రమాంపల్లి విద్యార్థులు
ప్రతిభ ‘ఖోఖో’ల్లలు
Published Mon, Jan 2 2017 9:59 PM | Last Updated on Tue, Sep 5 2017 12:12 AM
చంద్రమాంపల్లి(పెద్దాపురం) :
బోధకులు చూపించిన మార్గం.. క్రీడాస్ఫూర్తితో పోరాట పటిమ.. ప్రభుత్వ ప్రోత్సాహంతో లక్ష్యసాధనే ధ్యేయంగా పరిగెడుతున్న ఆ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఖేలో ఇండియా జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు అండర్–14, అండర్–17 విభాగాల నుండి జాతీయ స్థాయికి ఎంపికైన జిల్లా టీమ్‌లో చంద్రమాంపల్లిలో చదువుకున్న సాలిపల్లి మణికంఠ, వెన్నా వెంకటేష్, మాదాసు సాయి వెంకట్ లు స్థానం సంపాదించారు. ఈ నెలలో నెలలో నెల్లూరు, నరసారావుపేటలో జరిగే స్థాయి ఖోఖోలో తలపడనున్నారు. వ్యాయామ ఉపా«ధ్యాయుడు మట్టా సుబ్బారావు పర్యవేక్షణలో పాఠశాల ప్రధానోపా«ధ్యాయురాలు కె.గాయత్రి ప్రోత్సాహం సామర్లకోటలో ఇంటర్మీడియట్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు లక్ష్య సాధనే ధ్యేయంగా జాతీయ స్థాయిలోనూ ప్రతిభ కనబరిచి పుట్టిన గ్రామానికి, చదివిన పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తామని ఘంటాపథంగా చెబుతున్నారు.
రైల్వేలో ఉద్యోగం సంపాదించాలి
ఎప్పటికైనా ఆటల్లో రాణించి, క్రీడా కోటాలో రైల్వే శాఖలో ఉద్యోగం సంపాందించాలని ఉంది. క్రీడలపై ఉన్న మక్కువ, తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో ఆటల్లో రాణించగలుగుతున్నాం.
–సాలిపల్లి మణికంఠ, ఇంటర్మీడియట్, దివిలి.
కోచ్‌ను కావడమే ప్రధాన ధ్యేయం
ఎంతో మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారిలో క్రీడాస్ఫూర్తితో పాటు క్రీడారంగంలో రాణిస్తూ కోచ్ కావాలన్నదే ప్రధాన ధ్యేయం. చిన్నప్పటి నుంచి క్రీడలతో ఉన్న మక్కువతోనే కోచ్‌ను కావాలని లక్ష్యంగా పెట్టుకున్నా. నాన్న చిరు వ్యాపారైనా.. ఆయన ప్రోత్సాహంతోనే క్రీడల పట్ల మక్కువను అలవర్చుకున్నాను.
–వెన్నా వెంకటేష్, ఇంటర్మీడియట్, చంద్రమాంపల్లి
వ్యాయామ ఉపాధ్యాయుడు కావాలని..
క్రీడల్లో ప్రతిభ కనబరిచి విద్యకు ప్రాధాన్యమిస్తూ ఎప్పటికైనా వ్యాయామ ఉపాధ్యాయుడిగా భవిష్యత్తులో ఎదగాలని ఉంది. క్రీడల పట్ల ఉన్న ఆసక్తితో పాటు మనతో పాటు మరింత మంది క్రీడాకారులను తయారు చేసే ఆలోచన ఒక్క వ్యాయామ ఉపాధ్యాయుడి ద్వారానే సాధ్యమని నా అభిప్రాయం.
– మాదాసు సాయి వెంకట్, ఇంటర్మీడియట్, చంద్రమాంపల్లి
క్రీడాకారులను ఆదుకోవాలి
క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం ఆర్థిక చేయూత ఇవ్వగలిగితే మరింత మంది క్రీడాకారులను దేశానికి అందించే వీలుంటుంది. ఖోఖో మంచి గుర్తింపునిచ్చి క్రీడాకారులను అన్ని విధాలా ఆదుకుంటే విద్యార్థుల్లో మరింత ఆసక్తి పెరుగుతుంది.
– మట్టా సుబ్బారావు, వ్యాయామ ఉపాధ్యాయుడు,
జడ్పీ ఉన్నత పాఠశాల, చంద్రమాంపల్లి
Advertisement