మంత్రి నారాయణను అరెస్ట్ చేయాలి: వైఎస్ జగన్
కడప: నారాయణ కాలేజీలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థినుల కుటుంబాలకు న్యాయం చేయాలన్న డిమాండ్ తో బుధవారం కడప నగరం బంద్ కు పిలుపునిచ్చారు. విద్యార్థినుల మృతదేహాలకు హైదరాబాద్ లో రీపోస్టుమార్టం నిర్వహించాలని, మంత్రి నారాయణను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కడప రిమ్స్ ఆస్పత్రి వద్ద విద్యార్థినుల తల్లిదండ్రులను మంగళవారం వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడారు.
వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే....
* రాష్ట్రవ్యాప్తంగా 15 నెలల్లో నారాయణ కాలేజీల్లో 11మంది విద్యార్థులు మృతి చెందారు
* వీరిలో 9 మంది అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు
* ఇంతమంది చనిపోతావుంటే సీఎం చంద్రబాబు ఎందుకు గమ్మునున్నారు
* నారాయణ కాలేజీల్లో చంద్రబాబుకు భాగం ఉంది కాబట్టి చూసిచూడనట్టు ఉంటున్నారు
* మరో విద్యాసంస్థలో ఇలా జరిగితే ముఖ్యమంత్రి అనే వ్యక్తి గమ్మునుంటాడా?
* సాయంత్రం 4.30కు ఘటన జరిగితే 6.30 వరకు జిల్లాలోనే ఉన్నా చంద్రబాబుకు తెలియలేదా?
* విద్యార్థుల తల్లిదండ్రులను కనీసం పరామర్శించలేదు, ఇటువైపు కన్నెత్తి చూడలేదు
* చనిపోయిన పిల్లలు టెన్త్ పాసయి 3 నెలలు కూడా కాలేదు
* కాలేజీకి ఎటువంటి సంబంధం లేదన్నట్టుగా కొత్తగా లవ్ లెటర్ సృష్టించారు
* వాళ్లు రాయని లెటర్లు చూపిస్తున్నారు
* అభంశుభం తెలియని పిల్లలపై అభాండాలు వేయడం ఎంతవరకు సమంజసం?
* పోస్టుమార్టం కూడా అన్యాయంగా చేస్తున్నారు
* ఉరి వేసుకోకముందే చనిపోయారా, ఉరి వేసుకున్నాక చనిపోయారా అని అడిగితే డాక్టర్ సమాధానం చెప్పలేకపోయారు
* నారాయణ కాలేజీ యాజమాన్యాన్ని కాపాడేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు
* పిల్లలను కాలేజీలకు పంపించాలంటే భయపడేలా విద్యా రంగాన్ని చంద్రబాబు దిగజార్చారు
* నాగార్జున వర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన దోషులను ఇంతకువరకు అరెస్ట్ చేయలేదు
* ఇద్దరు విద్యార్ధినుల ఆత్మహత్యపై జ్యుడీషియల్ విచారణ జరగాలి
* రీ పోస్టుమార్టం హైదరాబాద్ లో జరిపించాలి
* మంత్రి నారాయణను అరెస్ట్ చేయాలి
* విద్యార్థినుల కుటుంబాలకు న్యాయం చేయాలన్న డిమాండ్ తో రేపు కడప నగరం బంద్ కు పిలుపునిస్తున్నాం
* కడప నగర వాసులు బంద్ కు సహకరించాలి