కదలలేడు... మెదలలేడు
కదలలేడు... మెదలలేడు
Published Thu, Aug 4 2016 10:34 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
కుటుంబ పెద్ద మంచానికే పరిమితం కావడంతో ఆ కుటుంబ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. లక్ష మందిలో ఒకరికి వచ్చే కండరాల క్షీణత వ్యాధికి గురికావడంతో కనీసం తన పనులు కూడా తాను చేసుకోలేని దీన స్థితి. ఆపరేషన్ కోసం రూ. 5 లక్షలు ఖర్చు చేస్తే గానీ అతడికి నయం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ కుటుంబం ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది.
– నల్లగొండ టూటౌన్
నల్లగొండ పట్టణంలోని ఇస్లాంపురకు చెందిన సయ్యద్ అహ్మద్ (47) వృత్తిరీత్యా స్థానికంగా గల ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. 15 ఏళ్ల క్రితం ప్రాథమికంగా ఉన్న కండరాల క్షీణత వ్యాధి ఏడాది కాలంగా ఎక్కువ కావడంతో కూర్చున్న చోటు నుంచి కదలలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో భార్య షమీల్ అన్నీ తానై సేవలు చేస్తోంది. చికిత్స కోసం హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రులకు తిరిగినా రూ.1.50 లక్షలు ఖర్చయిందే గానీ జబ్బు మాత్రం నయం కాలేదు.
లక్ష మందిలో ఒకరికి... ఖర్చు రూ. 5 లక్షలు
ఈ అరుదైన వ్యాధి లక్ష మందిలో ఒక్కరికి వస్తుందని డాక్టర్లు చెప్పారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వ్యాధికి ఆపరేషన్ కేవలం ముంబాయిలో మాత్రమే చేస్తారని, ఇందుకోసం రూ. 5 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. ఇప్పటికే కనీసం మందులు వాడేందుకు సైతం డబ్బులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందుల్లో పడిపోయారు. చిన్న ఇల్లు తప్ప ఎలాంటి ఆస్తి లేకపోవడంతో చికిత్స చేయించుకోలేక ఇంట్లోనే జీవితాన్ని వెల్లదీస్తున్నాడు.
ఆర్థిక సాయం కోసం ఎదురుచూపులు
కండరాల క్షీణతతో మంచం పట్టిన భర్తను బతికించుకునేందుకు భార్య షమీల్ పడరాని పాట్లు పడుతుంది. ట్యూషన్ చెప్పుకుంటూ జీవిస్తున్న ఆమె భర్తను ఎలా బతికించుకోవాలో అర్థంకాని పరిస్థితిలో పడిపోయింది. దీంతో దాతలు ఎవరైనా స్పందించి తన భర్త ఆపరేషన్‌కు సాయం అందించకపోతారా అని ఆశగా ఎదురుచూస్తుంది.
దాతలు సంప్రదించాల్సిన నంబర్ : 99122 51518
అకౌంట్ నంబర్: 62358933711
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్
Advertisement