జిల్లాలో వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ విద్యాశాఖకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇప్పటికే మడకశిరలో పదో తరగతి తెలుగు పేపర్–1 ప్రశ్నపత్రం లీక్ కావడం, కదిరిలో నారాయణ పాఠశాలలో హిందీ పరీక్ష జవాబులు సిద్ధం చేస్తూ మీడియాకు అడ్డంగా దొరికిపోయారు.
అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లాలో వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ విద్యాశాఖకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇప్పటికే మడకశిరలో పదో తరగతి తెలుగు పేపర్–1 ప్రశ్నపత్రం లీక్ కావడం, కదిరిలో నారాయణ పాఠశాలలో హిందీ పరీక్ష జవాబులు సిద్ధం చేస్తూ మీడియాకు అడ్డంగా దొరికిపోయారు. ఈ రెండు ఘటనలపై అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఘటనల నుంచి నుంచి ఇంకా తేరుకోకనే 8,9 తరగతుల సమ్మెటివ్–3 (వార్షిక) పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ వ్యహారం బయట పడింది. సమ్మెటివ్–3 పరీక్షల్లోనూ ప్రశ్నపత్రాలు రెండు రోజుల ముందే విద్యార్థుల చేతుల్లో కనిపిస్తున్నాయి. స్వయంగా విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) ప్రతాప్‌రెడ్డి జిల్లాలో మకాం వేసి పరీక్షల నిర్వహణను పరిశీలిస్తున్న సమయంలో ఇలా ప్రశ్నపత్రాల వ్యవహారం వెలుగుచూడటం చర్చనీయాంశమైంది.
రహస్యం లేని పరీక్షలు
తొలిసారి నిరంతర సమగ్ర మూల్యాంకం (సీసీఈ) విధానం అమలవుతుండటంతో అటు విద్యార్థులతో పాటు ఇటు ఉపాధ్యాయుల్లోనూ ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో ప్రశ్నపత్రాలు ఇలా బహిరంగంగా దొరుకుతుండడంతో ఆయా యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. విద్యాశాఖ ఉదాసీనతో వ్యవహరించడం వల్లే ప్రశ్నపత్రాలు లీకులు జరుగుతున్నాయనీ, ఒకరిద్దరిపై గట్టి చర్యలు తీసుకుంటే అందరికీ భయం ఉంటుందంటున్నారు.