'తెలంగాణ ఎందుకొచ్చిందా అనిపిస్తోంది'
నర్సాపూర్ (మెదక్): రైతుల ఆత్మహత్యలు చూస్తుంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చామా అనిపిస్తోందని మాజీ మంత్రి, మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధ కలిగిస్తోందన్నారు. గురువారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 1200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, మెదక్ జిల్లాలోనే 180 మంది ఆత్మహత్య చేసుకున్నారని వాపోయారు. ఆత్మహత్య చేసుకున్న బాధిత రైతు కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందడం లేదని ఆమె ఆరోపించారు.
రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు ముఖ్యమే అయినా.. రైతుల కష్టాలు తీర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపూ లేదా అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలోని 263 మండలాల్లో కరువు పరిస్థితులు ఉండగా.. జిల్లాలో అన్ని మండలాల్లో కరువు పరిస్థితులున్నాయన్నారు. తాము అధికారంలో ఉండగా ఆంధ్ర నాయకుల కొమ్ము కాస్తున్నామని ఆరోపించే వారు.. ఇప్పుడు ఎవరి కొమ్ము కాస్తున్నారని ప్రశ్నించారు.