కేసీఆర్ ది ఫ్యూడల్ పాలన
• సీఎం కేసీఆర్‌పై సురవరం మండిపాటు
• నోట్ల రద్దుపై నేరుగా నిరసన తెలపలేకపోయారు
• రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్నారు
సాక్షి, వరంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోలేని పిరికిపంద అని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీ ముందస్తు ఏర్పాట్లు చేయకుండా పెద్ద నోట్లు రద్దు చేస్తే కేసీఆర్ నేరుగా నిరసన తెలపలేకపోయారని విమర్శించారు. రాష్ట్రంలోని అవినీతి, అక్రమాలు కేంద్రానికి తెలిసి ఉంటాయని, కేంద్రం ఎక్కడ ఇబ్బందులకు గురిచేస్తుందోనన్న ఆందోళనతోనే కేసీఆర్.. ప్రధానికి కేవలం వినతిపత్రం ఇచ్చి ఊరుకున్నారన్నారు.
కేసీఆర్‌కు సిగ్గు, శరం, నైతికత లేవని ధ్వజమెత్తారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర నిర్మాణ మహాసభలు హన్మకొండలో సోమవారం ప్రారంభమయ్యారుు. సురవరం ఈ సభలను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఫ్యూడల్ విధానాలతో నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు ఉంటే తనను నిలదీస్తాయన్న అభద్రతతో... ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లోకి చేర్చుకుంటున్నారని ఆరోపించారు. దేవుళ్లను, పుష్కరాలను, యాగాలను ముందు పెడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.
దేశంలో నియంతృత్వ ప్రభుత్వం
దేశంలో నియంతృత్వ ప్రభుత్వం నడుస్తోందని సురవరం వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు బీజేపీ ప్రభుత్వం చేసిన ఘోర రాజకీయ తప్పిదమన్నారు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో విదేశాల్లోని నల్లధనాన్ని తీసుకువస్తానన్న మోదీ.. రెండున్నరేళ్లరుునా తీసుకురాలేదన్నారు. దీనిపై ప్రజలకు సమాధానాలు చెప్పలేకే పెద్దనోట్లను రద్దు చేశారన్నారు. ‘‘ప్రధాని నిర్ణయంతో సామాన్య ప్రజలే ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేట్ శక్తులకు, సంపన్నులకు ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదు. పేదలు కూడ బెట్టుకున్న డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుంటే నోటీసులు జారీచేస్తున్నారు. ఫోన్ ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవాలని ప్రధాని చెబుతున్నారు. కూరగాయలు కొనడానికి, చెప్పులు కుట్టించడానికీ సెల్‌ఫోన్‌తో చెల్లింపులు చేస్తారా? సామాన్యుడు ఆన్‌లైన్ చెల్లింపులు చేయగలుగుతాడా? మెడపై తల ఉన్నవాడు, తలలో మెదడు ఉన్నవాడు ఇలాంటి ఆలోచన చేయడు’’ అని దుయ్యబట్టారు.
మోదీవి ఫాసిస్టు ఆలోచనలు
దేశంలో మతపరమైన దాడులు, దళి తులపై దాడులు పెరుగుతున్నాయని సుర వరం ఆందోళన వ్యక్తంచేశారు. గోరక్షణ పేరుతో ఊచకోత కోస్తున్నారన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ అనే రిమోటు కేంద్రాన్ని నడిపి స్తోందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం యూపీఏ విధానాలనే అవలంభిస్తోందని, ఆయన ప్రధాని అయ్యాక ఇరుగుపొరుగు దేశాలతో సత్సంబంధాలు దెబ్బతిన్నాయ న్నారు. ‘‘మోదీ ఫాసిస్టు ఆలోచన, విధానా లతో ముందుకుపోతున్నారని, అందుకు వ్యతిరేకంగా సీపీఐ ముందుకు పోతుం దన్నారు.
విదేశీయులను వెనక్కి పంపి స్తానని విష ప్రచారం చేసిన వంచకుడు, రేపిస్టు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యా డని అన్నారు. కమ్యూనిస్టులు శాస్త్రీయ ఆలోచనతో పోరాటాలు చేయాలని పిలుపు నిచ్చారు. నూతన ఆర్థిక, రాజకీయ పరిణా మాలు, డబ్బు ప్రభావం కమ్యూనిస్టు పార్టీలకు నష్టం కలిగిందని పేర్కొన్నారు. వరంగల్ మహాసభ పార్టీ బలమైన నిర్మా ణానికి వేదిక కావాలని ఆకాంక్షించారు. మహాసభల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, నేతలు పువ్వాడ నాగేశ్వర్ రావు, అజీజ్‌పాషా, గుండా మల్లేష్, పి.పద్మ పాల్గొన్నారు.