తిరుపతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రైల్వేశాఖ ద్వారా కావాల్సిన అన్ని అవసరాలు తీరుస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. శనివారం తిరుచానూరు క్రాసింగ్ రైల్వే స్టేషన్ నిర్మాణానికి సురేష్ ప్రభు తిరుపతి రైల్వేస్టేషన్లో ఆన్లైన్ ద్వారా శంకుస్థాపన చేశారు. అనంతరం సురేష్ ప్రభు మాట్లాడుతూ.... ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన తర్వాత తిరుపతి నుంచి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు.
నిత్యం లక్షల మంది ప్రయాణికులతో కిటకిటలాడే తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం నిర్ధుష్ట ప్రణాళికలు రూపొందిస్తామని ఆయన చెప్పారు. నెలరోజుల్లో టీటీడీ ఈవో, ఛైర్మన్ను ద.మ.రై. జీఎంతో వచ్చి కలుస్తానని తెలిపారు. రైల్వే బడ్జెట్ రూ. 40 వేల కోట్ల నుంచి రూ. లక్షా 20 వేల కోట్లకు పెరిగిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైల్వే బడ్జెట్లో నిధులు పెరగడం వల్ల అభివృద్ధి పనులు చురుకుగా సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో మౌలిక వసతులదీ కీలక పాత్ర అని సురేష్ ప్రభు స్పష్టం చేశారు. అనంతరం సురేష్ ప్రభు విజయవాడకు బయలుదేరారు. అంతకుముందుకు సురేష్ ప్రభు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.